Mahaa Daily Exclusive

  కుల్గాంలో తుపాకుల మోత….

Share

కుల్గాంలో తుపాకుల మోత..
* లష్కర్‌ ఉగ్రవాది హతం!
* సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడికి ప్రతీకారంగా భద్రతా బలగాల ఆపరేషన్‌.
* రెండో ఉగ్రవాది, కమాండర్‌ లతీఫ్‌ భట్‌ మృతిపై వీడని ఉత్కంఠ.

శ్రీనగర్‌,మహా.

జమ్మూకశ్మీర్‌లోని దక్షిణ కశ్మీర్‌ ప్రాంతం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కుల్గాం జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మృతుడిని ప్రాథమికంగా ఉమర్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి అతడి మృతదేహంతో పాటు ఏకే శ్రేణి తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఆరు రోజులుగా ముమ్మర గాలింపు.

గత వారం సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై జరిగిన దాడికి ప్రతీకారంగా భద్రతా బలగాలు ఆరు రోజులుగా కుల్గాం పరిసరాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నవంబర్‌ 11న అఖ్రాన్‌ ప్రాంతంలోని మీర్‌బజార్‌ సమీపంలో 46వ బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సోమ్‌వీర్‌ సింగ్‌ చేతికి, కానిస్టేబుల్‌ రాకేశ్‌ దాస్‌ కాలికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. కానిస్టేబుల్‌ సంతోష్‌ చంద్రుకు పొట్ట, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత అనంత్‌నాగ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీనగర్‌లోని 92 బేస్‌ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం చెట్లు, పొదలు, బురద ప్రాంతాలను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన దర్యాప్తు బృందాలు, సుమారు 50 మీటర్ల దూరం నుంచి ఏకే తుపాకులతో కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు గుర్తించాయి. ఘటనా స్థలంలో లభించిన తూటాల ఖాళీ కేసులను ఫోరెన్సిక్‌ నిపుణులు గత ఉగ్రదాడుల ఆధారాలతో పోల్చి చూస్తున్నారు. ఉగ్రవాదులకు స్థానికంగా ఆశ్రయం కల్పించి, రెక్కీ నిర్వహించి, తప్పించుకునేందుకు సహకరించిన లష్కరే తోయిబా మద్దతు వ్యవస్థపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో 500 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించి, కనీసం 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లతీఫ్‌ భట్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.

సీఆర్‌పీఎఫ్‌పై దాడిలో లష్కరే తోయిబా స్థానిక కమాండర్‌ మహమ్మద్‌ లతీఫ్‌ అహ్మద్‌ భట్‌ కీలక సూత్రధారిగా భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. గతంలో జులై 22న అనంత్‌నాగ్‌లో పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ అషిక్‌ హుస్సేన్‌ ఖురేషీ హత్య, జులై 31న కుల్గాంలో వలస కార్మికుల హత్య కేసుల్లోనూ ఇతడి ప్రమేయంపై దర్యాప్తు జరిగింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో చేతులు కలిపి, స్థానిక సానుభూతిపరుల సాయంతో నిత్యం స్థావరాలు మారుస్తున్న లతీఫ్‌ భట్‌ సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో చిక్కుకున్నట్లు తొలుత సమాచారం అందింది. ఉమర్‌తో పాటు లతీఫ్‌ భట్‌ కూడా మట్టుబడ్డాడని కొన్ని కథనాలు వెలువడినప్పటికీ, భద్రతా బలగాల నుంచి పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.

కిష్త్వార్‌ ఘటనతో మరింత అప్రమత్తత.

మరోవైపు, కిష్త్వార్‌ జిల్లాలో విధులకు వెళ్తూ అదృశ్యమైన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (ఎస్‌పీఓలు) బాబీ చంద్‌, యశ్‌పాల్‌ కుమార్‌లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడం కలకలం రేపింది. నవంబర్‌ 12న దచన్‌ అటవీ ప్రాంతంలో బుల్లెట్‌ గాయాలతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుల్గాం, కిష్త్వార్‌ ఘటనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ దాడి దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయని, ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నామని సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ ఖిర్వార్‌ తెలిపారు. ఉగ్రవాదులను ఏరివేసి, అనుమానిత ప్రాంతాలను పూర్తిస్థాయిలో జల్లెడ పట్టే వరకు గాలింపు ఆగదని అధికారులు తేల్చిచెప్పారు.