టోల్ దాటగానే వివరాలు ఫోన్కు!
• బీమా లేని వాహనాలపై ఎన్హెచ్ఏఐ నిఘా.
• తొలుత ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు, త్వరలో దేశవ్యాప్త అమలు.
న్యూఢిల్లీ, మహా.
వాహనాలకు తప్పనిసరిగా ఉండాల్సిన థర్డ్ పార్టీ బీమా గడువు ముగిసినా, బీమా లేకుండానే జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నా ఇకపై వాహన యజమానులకు నేరుగా హెచ్చరిక సందేశాలు అందనున్నాయి. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) సరికొత్త హెచ్చరిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజా దాటిన కొద్ది నిమిషాల్లోనే బీమా గడువు ముగిసిన వాహనాల యజమానుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపించే విధానాన్ని ఎన్హెచ్ఏఐ ప్రారంభించింది. తొలుత ఢిల్లీలోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 (యూఈఆర్-2)పై ఉన్న ముండ్కా టోల్ ప్లాజా వద్ద ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తుండగా, అక్కడి ఫలితాలను సమీక్షించిన అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ కొత్త వ్యవస్థ ద్వారా టోల్ ప్లాజా దాటే ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) నిర్వహిస్తున్న ‘వాహన్’ డేటాబేస్లోని వివరాలను ఆటోమేటిక్గా తనిఖీ చేస్తారు. వాహనానికి సంబంధించిన బీమా పాలసీ చెల్లుబాటులో ఉందా లేదా గడువు ముగిసిందా అనే విషయాన్ని సాఫ్ట్వేర్ తక్షణమే గుర్తిస్తుంది. ఒకవేళ బీమా గడువు ముగిసినట్లు తేలితే వాహన యజమాని ఫోన్కు ఎస్ఎంఎస్ పంపుతారు. ఆ సందేశంలో వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, టోల్ ప్లాజా దాటిన సమయం, బీమా గడువు ముగిసిన తేదీ వంటి పూర్తి వివరాలను పొందుపరచడంతో పాటు వెంటనే పాలసీని పునరుద్ధరించుకోవాలని సూచిస్తారు.
బీమా లేకుండా వాహనం నడపడం మోటారు వాహనాల చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. 2026 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన సెక్షన్ 196 ప్రకారం, బీమా లేకుండా మొదటిసారి పట్టుబడితే వాహనానికి వర్తించే ప్రాథమిక బీమా ప్రీమియంకు మూడు రెట్లు లేదా రూ.5,000 (ఏది ఎక్కువైతే అది) జరిమానాగా విధిస్తారు. రెండోసారి లేదా ఆ తర్వాత ఉల్లంఘనలకు పాల్పడితే ప్రాథమిక ప్రీమియంకు ఐదు రెట్లు లేదా రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. బీమా లేని వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు బాధితులకు, మృతుల కుటుంబాలకు చట్టప్రకారం పరిహారం అందడం కష్టమవుతున్న నేపథ్యంలో, వాహనదారులను ముందుగానే అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. అయితే టోల్ ప్లాజా వద్ద ఎస్ఎంఎస్ రావడం అంటే వెంటనే జరిమానా విధించినట్లు కాదని, ప్రస్తుతానికి ఇది బీమా పునరుద్ధరణను గుర్తుచేసే హెచ్చరిక వ్యవస్థ మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.






