- ఛత్తీస్‌గఢ్ సీఎంతో రేవంత్ భేటీ
- సమ్మక్క సాగర్ బ్యారేజీకి తొలగనున్న అడ్డంకులు
- ఎన్ఓసీ జారీకి హామీ
రాయ్ పూర్, మహా : గోదావరి జలాల వినియోగానికి కీలకమైన సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించి మరో ముందడుగు పడింది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. మంగళవారం రాయ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ సాయి.. ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రానున్న కాలంలో తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న ఇతర అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించడంతో పాటు.. భూసేకరణ, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రాంతంలో సుమారు 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. దీనివల్ల 17 ఆదివాసీ గ్రామాలతో పాటు భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని గుర్తించారు. ఈ సమస్యలను తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు. కొత్త ప్రాంతంలో నిర్మాణం చేపట్టినప్పటికీ ఛత్తీస్‌గఢ్ భూభాగంలో బ్యాక్‌వాటర్ ప్రభావం ఎంత ఉంటుందన్నది రెండు రాష్ట్రాల మధ్య కీలక అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో పొరుగురాష్ట్రం కోరిన మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో అధ్యయనం చేయించారు. ఆ రిపోర్ట్ ప్రకారం సాధారణంగా పూర్తిస్థాయి నీటిమట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని తెలిపింది. బ్యాక్‌వాటర్ ప్రభావం, ముంపు ప్రాంతాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన అధ్యయన నివేదికను జూలై 30వ తేదీన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా ముంపు ప్రభావంపై ఉన్న అభ్యంతరాలను పరిష్కరించి ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ కోరుతోంది. ప్రభావిత భూములకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేసింది.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినప్పటికీ.. దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అంతర్రాష్ట్ర అనుమతులు కీలకంగా మారాయి. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని పలు విభాగాల నుంచి ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు లభించినప్పటికీ.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్ఓసీ లేకపోవడంతో అంతర్రాష్ట్ర అంశాల పరిశీలన ముందుకు సాగడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అభ్యంతరాల కారణంగా సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా కమిటీకి తన సిఫారసును పంపడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అందువల్ల ఛత్తీస్‌గఢ్ నుంచి అనుమతి లభిస్తే ప్రాజెక్టు తదుపరి క్లియరెన్సుల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమీపంలో గోదావరి నదిపై ఈ సమ్మక్క సాగర్ బ్యారేజీని నిర్మించారు. సుమారు 1,143 మీటర్ల పొడవు, 59 రేడియల్ గేట్లతో నిర్మించిన ఈ బ్యారేజీకి పూర్తి స్థాయి నీటిమట్టం +83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. దీని ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించే ప్రణాళిక ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద సుమారు 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం, రామప్ప-పాకాల లింక్ కెనాల్ కింద మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు. దేవాదుల ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు కూడా నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంది. సాగుతో పాటు మార్గమధ్యంలోని ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చడంలోనూ ఈ బ్యారేజీ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్ఓసీ కోసం తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. 2025 సెప్టెంబర్‌లోనూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కలిసి ఈ అంశంపై చర్చించారు. ఈ ఏడాది జూన్‌లో కూడా ఆయన మరోసారి ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాయ్‌పూర్‌కు వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల నవంబర్ 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలోనూ ఈ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి అనుమతి ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.






