పెద్దపల్లి, మహా : పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నంది మేడారం కోర్టులో విచారణలో ఉన్న ఓ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించి లంచం తీసుకుంటున్న సమయంలో రవీందర్‌ను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు డొంకెన రవీందర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కునారం గ్రామం. తదుపరి విచారణ నిమిత్తం రవీందర్‌ను కరీంనగర్‌కు తరలించారు.








