Mahaa Daily Exclusive

  214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల ప్రోత్సాహకం!

Share

214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల ప్రోత్సాహకం!
* మూడేళ్లలో 824 మంది లొంగుబాటు.. ఇప్పటివరకు రూ.17.68 కోట్ల రివార్డుల పంపిణీ.
* మందుపాతరలు పూర్తిగా తొలగించాకే కర్రెగుట్టల్లోకి పర్యాటకులకు అనుమతి.
* హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అజ్ఞాత నేతలకు డీజీపీ సీవీ ఆనంద్‌ పిలుపు.

హైదరాబాద్‌, మహా.

సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక భరోసా కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ ‘లొంగుబాటు మరియు పునరావాస విధానం’ కింద సోమవారం 214 మంది మాజీ మావోయిస్టు కేడర్లకు రూ.5.59 కోట్ల నగదు ప్రోత్సాహకాలను (రివార్డులను) డీజీపీ సీవీ ఆనంద్‌ పంపిణీ చేశారు. లొంగిపోయిన ఆయుధాలు విడిచిన రోజే తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.53.50 లక్షలు అందించిన పోలీసులు, వారి ఆధార్‌, బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించిన అనంతరం మిగిలిన రివార్డు మొత్తాన్ని ఖాతాల్లో జమ చేశారు. తాజా చెల్లింపులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 659 మంది లబ్ధిదారులకు రూ.17.68 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేసినట్లు డీజీపీ వెల్లడించారు. అర్హులైన మరో 96 మందికి సంబంధించి ఆధార్‌, బ్యాంకు ఖాతాల పరిశీలన పూర్తయిన వెంటనే నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

మూడేళ్లలో 824 మంది లొంగుబాటు.

రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ గత మూడేళ్లుగా గణనీయంగా ఊపందుకుందని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. 2025 అక్టోబర్‌ 21న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సాయుధ పోరాటాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఇచ్చిన పిలుపుతో లొంగుబాట్లు మరింత పెరిగాయని పేర్కొన్నారు. 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 824 మంది అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టారని, వీరిలో 2024లో 49 మంది, 2025లో 509 మంది, 2026లో ఇప్పటివరకు 266 మంది ఉన్నారని వివరించారు. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, డివిజనల్‌, ఏరియా కమిటీ సభ్యులతో పాటు పార్టీ, మిలీషియా సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు 754 మంది, తెలంగాణ నుంచి 59 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 9 మంది, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున లొంగిపోయారని వెల్లడించారు.

ఇళ్ల స్థలాలు, నిమ్స్‌లో ఉచిత వైద్య సదుపాయం.

లొంగిపోయిన మావోయిస్టులకు కేవలం నగదు ప్రోత్సాహకమే కాకుండా సమగ్ర పునరావాస సదుపాయాలు కల్పిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. తెలంగాణకు చెందిన 59 మందిలో 57 మందికి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో నగదు రహిత వైద్య చికిత్స కోసం ‘ఆరోగ్య రక్షణ’ కార్డులను జారీ చేశామని, మిగిలిన ఇద్దరికి ఆధార్‌ వివరాలు అందిన వెంటనే అందజేస్తామని చెప్పారు. అలాగే 10 మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలను కేటాయించామని, మిగిలిన 49 మందికి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఇప్పటివరకు 252 తుపాకులు (48 ఏకే-47లు, 37 ఇన్సాస్‌, 37 ఎస్‌ఎల్‌ఆర్‌లు సహా), 359 బీజీఎల్‌ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి సహా తెలంగాణకు చెందిన ముగ్గురు అగ్రనేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని, వారు కూడా హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు.

కర్రెగుట్టల్లో మైన్ల ముప్పు.. పర్యాటకులకు నిరీక్షణ.

మరోవైపు, ములుగు జిల్లాలోని కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నప్పటికీ, ఇప్పుడే పర్యాటకులను అనుమతించే పరిస్థితి లేదని డీజీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. గతంలో మావోయిస్టులు కర్రెగుట్టల్లో పెద్ద సంఖ్యలో మందుపాతరలు, ముఖ్యంగా ఒత్తిడికి పేలే ప్రెషర్‌ మైన్స్‌ను అమర్చారని తెలిపారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని, ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులను విచారించగా 9 మావోయిస్టు డంప్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మందుపాతరలను పూర్తిగా గుర్తించి నిర్వీర్యం చేయకుండా పర్యాటకులను లోపలికి అనుమతిస్తే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, అందుకే పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే పర్యాటకులకు ప్రవేశం కల్పిస్తామని డీజీపీ తేల్చిచెప్పారు.