Mahaa Daily Exclusive

  డ్రగ్స్ మాఫియాను అంబేద్కర్ విగ్రహం ముందు ఉరితీస్తాం..! హిమాయత్‌నగర్‌లో ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర హెచ్చరిక..

Share

  •  మహిళా శక్తి తలచుకుంటే మత్తు మహమ్మారిని తరిమికొట్టవచ్చు.
  •  2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే మోదీ సంకల్పం.
  •  హిమాయత్‌నగర్‌లో ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర హెచ్చరిక..

హైదరాబాద్, మహా.

దేశ యువత భవిష్యత్తును అంధకారం చేస్తూ, విదేశాల నుంచి మాదకద్రవ్యాలను అక్రమంగా సరఫరా చేసే డ్రగ్స్ మాఫియాపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే, యువత జీవితాలను నాశనం చేసే డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులను పట్టుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఉరితీస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ‘నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్’ పేరిట ఆయన చేపట్టిన మూడు రోజుల అవగాహన పాదయాత్ర రెండో రోజు గురువారం హిమాయత్‌నగర్‌కు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిషన్‌రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో చైతన్యం రావాలి
డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టే పోరాటంలో మహిళా శక్తి, ముఖ్యంగా తల్లులు, అక్కాచెల్లెళ్లు, విద్యార్థినులు కీలక పాత్ర పోషించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో డ్రగ్స్ వ్యతిరేక చైతన్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నవమాసాలు మోసి, ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసి ఉన్నత చదువుల కోసం విద్యాసంస్థలకు పంపించిన పిల్లలు మత్తుపదార్థాల బారిన పడితే ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు గళమెత్తి తమ కుటుంబాల్లో, పరిసరాల్లో వ్యసనాలకు బానిసైన వారిలో మార్పు తెచ్చినప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ ఆశించిన ‘నషా ముక్త్ భారత్’ సాకారమవుతుందని పేర్కొన్నారు.
యువత క్రీడల వైపు అడుగులేయాలి.. పుల్లెల గోపీచంద్ స్ఫూర్తి కావాలి
భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద యువజన, విద్యార్థి శక్తి ఉందని, ఆ అపార శక్తిని దేశ ప్రగతికి వినియోగించుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. నేడు మన దేశ మహిళలు సైన్యం, సరిహద్దు భద్రతా దళాలు, అంతరిక్ష పరిశోధనలు, ఐటీ, వైద్య రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. అలాంటి యువత మత్తుకు బానిసైతే దేశానికే కాకుండా ప్రపంచానికే తీరని నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశానికి పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు.
పోలీసుల బాధ్యతే కాదు.. మనందరి కర్తవ్యం
2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా పునరావాస కేంద్రాలను 300 నుంచి 2 వేలకు పెంచడంతో పాటు, 50 కోట్ల మంది యువతకు అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టిందని వివరించారు. అయితే, డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం ఈ సామాజిక ఉద్యమంలో భాగస్వామి కావాలని కోరారు.
కదలివచ్చిన విద్యార్థి లోకం.. ఉత్సాహంగా రెండో రోజు యాత్ర
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యంగా అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర సాగుతున్న ఈ పాదయాత్రకు నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బుధవారం అంబర్‌పేట మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమై ముషీరాబాద్ వరకు సాగిన తొలిరోజు యాత్రలో సినీ నటులు వెంకటేష్, నిఖిల్ సిద్ధార్థ్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు పాల్గొని మద్దతు పలికారు. గురువారం అశోక్‌నగర్ నుంచి ప్రారంభమై ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్, లిబర్టీ, ఖైరతాబాద్, పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వరకు సాగిన యాత్రలో అవినాష్ కాలేజ్, అకాడమీ హైట్స్ పబ్లిక్ స్కూల్, స్టాన్లీ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థినులు, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సిబ్బంది, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థినులు, మహిళా శక్తికి కిషన్‌రెడ్డి శిరస్సు వంచి నమస్కరించారు. ఈ మూడు రోజుల పాదయాత్ర శుక్రవారం జూబ్లీహిల్స్‌లో నిర్వహించే భారీ సంకల్ప సభతో ముగియనుంది.

Latest