Mahaa Daily Exclusive

  ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..! ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమాలను విజయవంతం చేయాలి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

Share

  • ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
  • ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమాలను విజయవంతం చేయాలి
  • విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.

హైదరాబాద్, మహా :: డిసెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 8వ తేదీన భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రక్షణ రంగ ఎక్స్‌పో, ఎయిర్ షో తదితర ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు విద్యార్థులను పెద్ద సంఖ్యలో సమీకరించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా డిసెంబర్ 11వ తేదీన నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడం ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న ప్రగతి, అంతర్జాతీయ పెట్టుబడుల అవకాశాలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే క్రీడా పోటీలను వీక్షించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, పట్టుదల, క్రమశిక్షణ పెంపొందడంతో పాటు, భవిష్యత్తులో వివిధ రంగాల్లో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణ, ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించడం ఎంతో ప్రయోజనకరమన్నారు.

విద్యార్థులను ఈ కార్యక్రమాలకు తరలించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సి.ఎస్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినన్ని బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు, వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, హైదరాబాద్ నగరానికి సమీపంలోని ప్రాంతాల్లో ఉన్న గురుకుల, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులను ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు తీసుకురావాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రయాణం, భోజనం, అల్పాహారం, తాగునీరు తదితర సదుపాయాలను సముచితంగా కల్పించాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల సమీకరణ, సమన్వయ బాధ్యతలను మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సైదులుకు నోడల్ అధికారిగా అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురానున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలని సి.ఎస్ పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి బాధ్యతతో, సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
అనంతరం, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. సుమారు 8,000 మంది క్రీడాకారులు పాల్గొననున్న ఈ క్రీడా పోటీల నిర్వహణలో ఎలాంటి లోపాలకు, ప్రతికూల పరిస్థితులకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, రవాణా, ప్రోటోకాల్, భద్రత, వైద్య సహాయం, హౌస్ కీపింగ్, పారిశుద్ధ్యం, ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలు, క్రీడా సామగ్రి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అదేవిధంగా, క్రీడా పోటీలకు విస్తృత స్థాయిలో మీడియా కవరేజీ కల్పించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, వాణి ప్రసాద్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజేంద్ర, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

Latest