Mahaa Daily Exclusive

  హైదరాబాద్ భూముల వేలానికి బిడ్డర్లు బేజారు..!

Share

  •  రూ.862 కోట్ల విలువైన భూములకు స్పందన కరువు.
  • మూసాపేట, కోకాపేటలో దాఖలు కాని బిడ్‌లు.

హైదరాబాద్, నవంబరు 27, మహా:

దేశంలోనే అత్యంత ఖరీదైన స్థిరాస్తి మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల వేలానికి అనూహ్య పరిణామం ఎదురైంది. కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించి భారీ ఆదాయం సమకూర్చుకోవాలని భావించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు నిరాశే మిగిలింది. నగరంలోని అత్యంత కీలకమైన మూసాపేట, కోకాపేట నియోపొలిస్ ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించిన ఈ-వేలంలో ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదు. ఉదయం కోకాపేటకు, మధ్యాహ్నం మూసాపేటకు రెండు విడతలుగా వేలం నిర్వహించినప్పటికీ కొనుగోలుదారుల నుంచి కనీస స్పందన కనిపించలేదు. దీంతో రెండు వేలం ప్రక్రియలను అధికారులు రద్దు చేయాల్సి వచ్చింది. దాదాపు రూ.862.65 కోట్ల కనీస విలువ కలిగిన 7.74 ఎకరాల భూములకు బిడ్డర్లు ముందుకు రాకపోవడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎకరాకు రూ.120 కోట్లు.. అయినా నో బిడ్స్!

కోకాపేట నియోపొలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17లో 4.59 ఎకరాల భూమిని వేలానికి ఉంచారు. దీనికి ఎకరాకు రూ.120 కోట్ల కనీస ధర నిర్ణయించారు. అంటే మొత్తం భూమి కనీస విలువ రూ.550.80 కోట్లు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ వేదికగా వేలం నిర్వహించినా ఒక్క బిడ్‌ కూడా నమోదు కాలేదు. ఈ భూమికి గత సెప్టెంబరులోనూ వేలం నిర్వహించగా ఒకే ఒక్క బిడ్‌ దాఖలైంది. పోటీ బిడ్లు లేకపోవడంతో అప్పట్లోనూ విక్రయం ముందుకు సాగలేదు. తాజాగా రెండోసారి కూడా స్పందన కరవవడం హెచ్‌ఎండీఏకు ఎదురుదెబ్బగా మారింది.

మూసాపేట ట్రక్ పార్క్ భూమికీ నిరాశే!

మరోవైపు కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని ట్రక్ పార్క్ పరిధిలో 3.15 ఎకరాల భూమిని వేలానికి ఉంచారు. హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర నిర్ణయించారు. మొత్తం విలువ రూ.311.85 కోట్లు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహించినా ఒక్కరు కూడా బిడ్‌ దాఖలు చేయలేదు. ఈ భూమి విక్రయాన్ని వ్యతిరేకిస్తూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వేలానికి ఎలాంటి అడ్డంకి లేకపోయినా కొనుగోలుదారులు మాత్రం ఆసక్తి చూపలేదు.

వరుసగా రెండోసారి నిరాశ.. హెచ్‌ఎండీఏకు ప్రశ్నలు!

ఇటీవల జూబ్లీహిల్స్‌లోని హుడా హైట్స్ ప్రాంతంలోనూ హెచ్‌ఎండీఏకు ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ రెండో దశలో 10,159 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఎనిమిది ప్లాట్లను చదరపు గజానికి రూ.2 లక్షల కనీస ధరతో వేలానికి ఉంచగా ఒక్క బిడ్డర్‌ కూడా ముందుకు రాలేదు. ఆ భూములకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలపై నెలకొన్న సందేహాలు, స్థలాన్ని వేలానికి సిద్ధం చేసిన తీరుపై అభ్యంతరాలు కొనుగోలుదారుల వెనుకడుగుకు కారణమై ఉండవచ్చని వార్తలు వెలువడ్డాయి.

ధరలే కారణమా.. మార్కెట్ పరిస్థితులా?

ఒకప్పుడు కోకాపేట నియోపొలిస్ భూముల వేలంలో ఎకరాకు రూ.100 కోట్లకు పైగా ధరలు పలికాయి. భారీ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడి భూములను దక్కించుకున్నాయి. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కనీస ధరకు కూడా బిడ్డర్లు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. భూముల అధిక ధరలు, భారీ ముందస్తు డిపాజిట్, పెట్టుబడులపై రాబడికి సంబంధించిన అంచనాలు, ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు కొనుగోలుదారుల నిర్ణయంపై ప్రభావం చూపి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వేలం విఫలమవడానికి నిర్దిష్ట కారణాన్ని హెచ్‌ఎండీఏ అధికారికంగా వెల్లడించలేదు.

నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న ప్రచారం ఒకవైపు కొనసాగుతుండగా, ప్రభుత్వమే నిర్ణయించిన కనీస ధరలకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడం మరోవైపు చర్చకు దారితీస్తోంది. భూముల వాస్తవ మార్కెట్ విలువ, అధికారులు నిర్ణయిస్తున్న కనీస ధరలు, పెట్టుబడిదారుల అంచనాల మధ్య అంతరం ఎంత ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుస వేలాల్లో ఎదురవుతున్న అనుభవాల నేపథ్యంలో హెచ్‌ఎండీఏ తన ధరల నిర్ణయ విధానం, వేలం నిర్వహణ వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Latest