: రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వెల్లడించాయి. గత ఏడాది కాలంగాపెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సిఈఓ కు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని పంపించినట్లు నెట్ వర్క్ ఆస్పత్రులు తెలిపాయి. ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ లో మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్, జర్నలిస్టు హెల్త్ స్కీం లలోను ప్రభుత్వం భారీగా బకాయిలు ఉందని వారు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆస్పత్రులు వెల్లడించాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 నెలల బకాయిలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఆ బకాయిలు మరింత పెరిగాయని చెబుతున్నారు. 672 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని ఇక ఇప్పటి వరకు మొత్తం 1000 కోట్ల రూపాయలకు పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని వారు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం గత ఏడాది కాలంలోనే నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 820 కోట్లను విడుదల చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్న పెండింగ్ బకాయిలతో పాటు కొత్త బిల్లులు కూడా క్లియర్ చేశామని ప్రభుత్వం అంటోంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు 400 కోట్ల రూపాయలకు మించి ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులకు మధ్య ఆరోగ్య శ్రీ బకాయిల విషయంలో చర్చ జరిగి ఒక నిర్ణయానికి రాకపోతే జనవరి 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ ఆసుపత్రులలో నిలిచిపోనున్నాయి. ఇదే జరిగితే ఆరోగ్య శ్రీ సేవలు పొందే నిరుపేదలు ఇబ్బంది పడాల్సి వస్తుంది.








