ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలంటూ కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని.. ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివారా అని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదిని అనుమతించిన పలు సుప్రీం కోర్టు తీర్పులను కేటీఆర్ తరపు న్యాయవాది ప్రస్తావించగా న్యాయవాదిని విచారణ సందర్భంలో అనుమతి ఇవ్వని పలు తీర్పులను ఏఏజీ రజనీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాదికి విచారణ గదులు ఉన్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ఒక రూంలో ఇన్వెస్టిగేషన్.. ఇంకో రూములో అడ్వకేట్ కూర్చుంటే ఏం ప్రాబ్లం.. ఏసీబీలో అలాంటి వసతులు ఉన్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్‌కు ఏసీబీలో సౌకర్యం ఉందో లేదో చెప్పాలని ఏఏజీకి హైకోర్టు ఆదేశించింది. దీనిపై సాయంత్రం 4 గంటలకు చెబుతామని కోర్టుకు ఏఏజీ తెలిపింది. విచారణ గదిలోకి నిందితుడితో న్యాయవాదిని కలిసి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కానీ ఇక్కడ కేటీఆర్ గతంలో మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే కాబట్టి.. న్యాయవాదికి కనిపించేలా విచారణ గదిలో ఏర్పాట్లు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.
కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించరు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవసరం లేనప్పుడు ఇన్వెస్ట్‌గేషన్ రూమ్‌లో న్యాయవాది ఉండడం ఎందుకు అని కోర్టు ప్రశ్న వేసింది. ఒక ముగ్గురి న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదికి చెప్పిన ధర్మాసనం.. వారిలో ఒకరిని విజుబుల్ డిస్టెన్స్ వరకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. సాయంత్రం తుది తీర్పు ఇచ్చిన కోర్టు కేటీఆర్ విచారణ సందర్భంగా లైబ్రరీ గదిలో న్యాయవాది ఉండొచ్చని స్పష్టం చేసింది. కేటీఆర్ పక్కనే న్యాయవాది ఉండాలన్న పిటిషన్ ను కోర్టు తొసిపుచ్చింది. ఏసీబీ కార్యాలయంలో లైబర్రీ ఉందని, లైబ్రరీ గదిలోని అద్దాలతో కూడిన గదిలో న్యాయవాది కేటీఆర్ విచారణ తీరును పరిశీలించేందుకు వీలుంటుందని కోర్టు పేర్కొంది. ఏసీబీ కార్యాలయంలోని లైబ్రరీ గదిలో న్యాయవాది రాంచందర్ రావుకు కోర్టు అనుమతించింది. కోర్టు నిర్ణయంతో గురువారం ఏసీబీ విచారణను ఎదుర్కునేందుకు కేటీఆర్ సన్నద్దమవుతున్నారు.








