Mahaa Daily Exclusive

  మీలో ఉన్న శక్తినిగుర్తించండి అపజయాలకు కుంగిపోవొద్దు జాతీయ యువజన దినోత్సవంలో – మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

Share

అపజయాలకు కుంగిపోవొద్దని.. మీలో ఉన్న శక్తిని గుర్తించి ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్ బాబు యువతకు సూచించారు.
స్వామి వివేకానంద బోధనలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆదివారం దోమల్ గూడలోని రామకృష్ణ మఠ్ లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరై యువతకు దిశా నిర్దేశం చేశారు. నేటి తరం యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతుంది. ఒక అపజయం ఎదురైతే చాలూ.. మా వల్ల ఏదీ కాదేమోననే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లే ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటన్నింటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం దక్కుతుందని తెలుసుకోవాలి. యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు’ అని అన్నారు. ‘

మీ ఆలోచన తీరే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీ తల్లిదండ్రులు, గురువులు.. ఇలా ఎవరో ఒకరు వచ్చి చేయి పట్టి నడిపిస్తారనే భావన నుంచి బయటకు రండి. మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోవాలి. క్రమ శిక్షణ, నిరంతర శ్రమ, పాజిటివ్ థింకింగ్ ను అలవర్చుకోవాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావాలి’ అని సూచించారు. ఈ దేశానికి మీరే నిజమైన ఆస్తి. నేను బాగుంటే చాలూ అనే స్వార్థంతో కాకుండా దేశం కోసం.. సమాజం కోసం ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న వారికి సాయం చేయండి. అప్పుడే జీవితానికి సార్థకత చేకూరుతుంది. ఆధ్యాత్మిక, మానవత విలువలను అలవర్చుకోండి. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించండి’ అని సూచించారు. యువతను జాగృతం చేసి సన్మార్గం వైపు నడిపించేందుకు రామకృష్ణ మఠ్ చేస్తున్నకృషి అభినందనీయం. యువతలో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ.. వారిలో దాగి ఉన్న శక్తిని వెలికి తీస్తుంది. నేను చదువునే రోజుల్లో ఇక్కడికి అనేక సార్లు వచ్చాను. ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్నప్పడు వచ్చాను. ఇప్పుడు వచ్చాను. ఇక్కడికొచ్చిన ప్రతిసారి నాలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ నన్ను నా లక్ష్యం వైపుకు నడిపిస్తుంది’ అని వివరించారు.