ప్రముఖ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్‌డ్ఇన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ఖాతా తెరిచారు. తన తొలి లింక్‌డ్‌ఇన్ పోస్టులో.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లనున్న నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్ సీఎంఎం)కు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు.
ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్ సీఎంఎం) లో భాగంగా నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలను ప్రోత్సహించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తన తొలి పోస్టులో పేర్కొన్నారు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు సంబంధించి ఏడు కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎన్ సిఎంఎం లో
భాగంగా 2031 నాటికి ఏకంగా 10 వేల మందికి శిక్షణను అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్ మిషన్ భవితవ్యంపై పారిశ్రామికవేత్తలు, నిపుణులతో లింక్‌డ్ఇన్ ప్లాట్‌ఫాంపై చర్చించనున్నట్లు వివరించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ యువతలోని సృజనాత్మకతను గుర్తించి, దానికి నైపుణ్యాభివృద్ధి ద్వారా మరింత పదునుపెట్టి.. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. సుస్థిరమైన మైనింగ్ విషయంలో భారత్ అంతర్జాతీయ లీడర్ గా ఎదిగేందుకు ఈ మిషన్ తోడ్పడుతుందని, దేశంలోని నైపుణ్యత కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు పారిశ్రామికవేత్తలు, ఎంట్రప్రెన్యూర్స్ తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగం, హై టెక్నాలజీ వంటి పరిశ్రమలకు ఎంతో కీలకమైన క్రిటికల్ మినరల్స్ ను అందుబాటులోకి తెచ్చి ఖనిజాల రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (NCMM) ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్రిటికల్ మినరల్స్ ను దేశీయంగా ఉత్పత్తి చేయడం, వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని అక్కడ లభించే కీలకమైన ఖనిజాలను భారతదేశానికి తీసుకురావడం, సుస్థిరమైన మైనింగ్ కార్యకలాపాలను ప్రోత్సహించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని అన్నారు.








