దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా? అని కేటీఆర్‌కు ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి చూపాలన్నారు. ఎన్నికలకు పారిపోయి కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్‌తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంపై కూడా తాను చర్చకు సిద్ధమని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటన చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చకు ఎక్కడికి రమన్నా వస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సున్నా ఇచ్చినా బుద్ధి మారడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గాడిద గుడ్డే వస్తదని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదని.. ఇక్కడే మీ దమ్ము ఏంటో తెలిసిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం పునర్వికాసం వైపు నడిపిస్తోందని తెలిపారు. మూడు ముక్కలుగా చీలిన బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కనిపించదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.








