Mahaa Daily Exclusive

  రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ ఫోబియా.. అప్పులు.. ఆదాయంపై అబద్ధాలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఫైర్…!

Share

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మీడియాతో కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ ఫోబియాలో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పడం, వాస్తవాలను వక్రీకరించడం తప్ప మరేదీ కాదన్నారు. 2024-25 కాగ్ రిపోర్ట్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి రూ. 22,000 కోట్ల వడ్డీలు కట్టిందని, కానీ దీనికి కారణం గత ప్రభుత్వ పాలన కాదని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ 4.3లక్షల కోట్ల అప్పులు చేశారని..పెట్టిన ఖర్చు, అభివృద్ధి కూడా మేం అనేక పర్యాయాలు చట్టసభలలో వెల్లడించామని గుర్తు చేశారు. రాష్ట్రానికి 18వేల కోట్ల ఆదాయం వస్తుందని ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పారని..యావరేజీగా చూస్తే 12వేల కోట్ల ఆదాయం వస్తుందని తేలిందని.. మరి ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని కవిత ప్రశ్నించారు. కట్టని అప్పులు కడుతున్నామని..పెరగని ఆదాయం పెరిగిందని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం విస్మయం కలిగించిందన్నారు.

హైడ్రాయే కారణం..
రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి హైడ్రా కారణమని కవిత ఆరోపించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 18వేల కోట్ల అంచనా నుంచి 5,800కోట్లకు పడిపోయిందని.. అయినా అరాచకం ఆపకుండా మలక్ పేటలో నిన్న ఇళ్లు కూల్చారన్నారు. హైడ్రాతో హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు కేసీఆర్ హయాంలో మూలనపడేయడంతోనే ఇప్పటి ప్రమాదానికి కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించడం సత్యదూరమని కవిత మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులకు సాంకేతిక అడ్డంకుల గురించి గతంలో కేసీఆర్ స్పష్టంగా అప్పటి ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిప పక్షానికి చెప్పారని కవిత తెలిపారు. అప్పట్లో కాంట్రాక్టర్ కు 100కోట్లు ఇచ్చారని..కరోనా సమయంలో మరోసారి అఖిల పక్షం సాక్షిగా కేసీఆర్ మరో 100కోట్ల ఇచ్చారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో 30ఏళ్లలో 3,340కోట్లు ఖర్చు చేస్తే..కేసీఆర్ పదేళ్లలో 3,890కోట్లు ఖర్చు చేసి 11.5కిలోమీటర్ల సొరంగం త్రవ్వారని..ఇంత ఖర్చు చేసి పనులు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అసలే పని చేయలేదని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం విడ్డూరమన్నారు.

పదేపదే ఢిల్లీకి వెళ్లినా..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కొట్టుకపోయాయని.. మెగా కృష్ణారెడ్డి సుంకిశాల ప్రాజెక్టు కూలిపోతే ఆర్టీఐ సమాచారం అడిగితే దేశ భద్రత సాకు చెప్పి నిరాకరించారని కవిత ఎద్దేవా చేశారు. ఏమన్నంటే పదేపదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తారని..అయినా నిధులు సాధించడం లేదని..రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని..ప్రతిపక్ష నేతగా ఆయన కూడా రాష్ట్రానికి నిధులపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రధానిని కలిశాక రాష్ట్రానికి వచ్చిందేమిటని ప్రశ్నిస్తే.. బయటకు వచ్చాక బీఆర్ఎస్ పనైపోతుందని..వరుస చావులు, కేసులంటూ ఏదేదో మాట్లాడారన్నారు. దీనిని చూస్తే ప్రధాని, సీఎంలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కలిసిపోయారని తేలిపోతుందన్నారు. ఎంతసేపు కల్వకుంట్ల కుటుంబంపై కేసులు, వేధింపులు ఎట్లా చేయాలనే రేవంత్ రెడ్డి పని పెట్టుకున్నాడన్నారు.

ప్రధానిని కలిసిన తర్వాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇంచార్జి అని సీఎం చెప్పుకున్నారని..పార్టీ పరంగా ఇంచార్జి అయితే మాకు ఇబ్బంది లేదు.. కానీ అధికారిక సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని..తిరుపతి రెడ్డికి కలెక్టర్ ఎందుకు ఎదురెళ్లి స్వాగతం చెబుతున్నారని..రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. మా కుటుంబంలో అధికారికంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నామని..ముఖ్యమంత్రి సోదరులు ఇష్టారీతినా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కిషన్ రెడ్డి నిధుల సాధనలో అడ్డుపడుతున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలపై కవిత స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ సీఎం రేవంత్ రెడ్డికి, బీజేపీకి మధ్య మంచి సంబంధాలున్నాయని వారిద్ధరు కలిసే పరస్పరం సహకరించుకుంటు పనిచేస్తున్నారన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు ఎలా వస్తుందన్న మాటలే నిదర్శనమని కవిత ఆరోపించారు. ప్రధాని మోదీ డైరక్షన్ లో ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. బీజేపీ, కాంగ్రెస్ లు ఎంపీ, ఎమ్మెల్యేలో ఎన్నికల్లో కలిసి పనిచేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీనే కాపాడుతుందని..మేం ఏదైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేంద్ర మంత్రులు మమ్మల్ని విమర్శిస్తుంటారని కవిత చెప్పుకొచ్చారు.