Mahaa Daily Exclusive

  ఎస్‌ఎల్‌‌బీసీ టన్నెల్ ప్రమాదం .. ఎనిమిది మంది మృతి..!

Share

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్​ వద్ద జరుగుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. టన్నెల్‌ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కన్పించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వివరించారు.

మట్టిదిబ్బ కింద ఆనవాళ్లు

5-8 మీటర్ల మట్టిదిబ్బ కింద నలుగురి వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్లు స్కానింగ్‌లో కన్పించాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మరో నలుగురు సిబ్బంది టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ కింద ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వివరించారు. సహాయక చర్యల్లో మొత్తం 12 విభాగాలు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. పనులు వేగంగా జరగటం లేదని కొందరు విమర్శిస్తున్నారని, లోపల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వారికి తెలియట్లేదు జూపల్లి మండిపడ్డారు.

టన్నెల్​ లోపలికి వెళ్లి చూస్తే తెలుస్తుంది

విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని జూపల్లి తెలిపారు. కాళేశ్వరంలో 200 కిలోమీటర్ల సొరంగం తవ్వామని బీఆర్ఎస్​ నేత హరీశ్ రావు అన్నారన్న జూపల్లి మరి పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీలో 20 కిలోమీటర్ల టన్నెల్‌ ఎందుకు తవ్వలేదు? అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

అంబులెన్సులు సిద్ధం
మరోవైపు సొరంగ మార్గంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి షిఫ్టులో 70మందికి పైగా సింగరేణి, ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్​, ర్యాట్ హోల్ మైనర్స్‌తో కూడిన బృందం లోపలికి వెళ్తోంది. జేసీబీలతో పూడికను ఎత్తిపోస్తున్నారు. కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు, వైద్యుల్ని అందుబాటులో ఉంచారు.