Mahaa Daily Exclusive

  మీనాక్షి మార్క్ కాంగ్రెస్ లో క్రమశిక్షణ యాక్షన్ ప్లాన్ షురూ…!

Share

ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పట్నుంచి మరో లెక్క అన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు మారిపోయాయి. ఇందుకు కారణం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. గతంలో ఏం జరిగిందో కానీ ఇప్పట్నుంచి మాత్రం ఎవరైనా పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిందేనన్న సిగ్నల్స్ ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలిగా ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఆ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆమె అధ్యక్షతన సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్, మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ల వారీగా నియోజకవర్గాల నేతలు పార్టీ కేడర్‌తో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కమిటీలు, సంస్థాగత పరిస్థితిని తెలుసుకుని పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నివేదికలు తెప్పించుకున్న మీనాక్షి పనిచేసేవారికి భవిష్యత్ లో పెద్దపీఠ వేస్తామని సంకేతాలిస్తున్నారు. వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పార్టీ ఫిరాయింపుల కారణంగా.. ఉప ఎన్నికల వచ్చే అవకాశముంది. ఆయా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాంటి వేళ.. జిల్లాల్లో నియోజకవర్గాల స్థాయిలో ఉన్న లోపాలను ఎలా సరి చేసుకుని ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించే అవకాశముంది.

సింపుల్ గా.. ఫోకస్ గా..

తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలిగా ఇటీవల మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టేందుకు తొలిసారిగా ఆమె హైదరాబాద్ వచ్చారు. తన వస్తున్న సందర్భంగా నగరంలో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అలాగే గాంధీ భవన్‌తోపాటు ఆ ప్రాంగణంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని పార్టీ కేడర్‌కు పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. అదీకాక.. ఈ బ్యానర్లు, ప్లెక్సీల వల్ల పార్టీ గెలుపు అసాధ్యమని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె స్పష్టం చేశారు. ప్రజల మధ్యకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకొని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని వారికి పార్టీ వ్యవహారాల బాధ్యులు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేశారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడమే రాజకీయ లక్ష్యంగా ఉండాలన్నారు.

ఫటాఫట్ నిర్ణయాలు

పార్టీకి ఇబ్బందిగా మారిన తీన్మార్ మల్లన్నపై వేటు వేసి క్రమశిక్షణ తప్పితే ఎవరిపైనయినా చర్యలు తప్పవని అందరికీ స్పష్టమైన సంకేతాలు పంపారు. పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యి.. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న విధానం హైకమాండ్ ను ఆశ్చర్యపరిచింది. రాహుల్ ఆలోచనలకు అనుగుణంగా రేవంత్ సర్కారు చాలా విశాలమైన ద్రుక్పథంతో కులగణన చేసింది. కానీ ప్రభుత్వ ఆలోచనను అభినందించకుండా కొందరు కాంగ్రెస్ నేతలే అసంత్రుప్త స్వరం వినిపించడంతో పరిస్థితి చేజారకుండా.. హైకమాండ్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇక తాజాగా సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో జరిగిన మీటింగ్ పైనా మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. మీటింగ్ కు ఎవరెవరు వచ్చారు.. ఏం మాట్లాడారన్నది కూడా తెలుసుకున్నారట. ఆ మీటింగ్ కు ప్రతిపక్ష నేతలను పిలవకుండా బావుండేదన్న అభిప్రాయంతో ఉన్నారట. ఇలా రాష్ట్ర పార్టీ నేతలకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను మేడమ్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చాలామందికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. పదవులు వచ్చాయి కానీ.. కొందరు నేతలు మాత్రం గాంధీభవన్ వైపు కూడా చూడడం లేదట. ఈ అంశంలోనూ మీనాక్షి సీరియస్ గా ఉన్నారట. పార్టీ ద్వారా పదవులు తీసుకుని… పార్టీని లైట్ తీసుకోవడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారట. అందుకే సదరు నేతలు అందరూ తనకు కనిపించాలని మేడమ్ ఆదేశాలిచ్చినట్లు టాక్. చాలామంది నేతల కార్పొరేషన్ పదవులు త్వరలోనే గడువు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పనిచేయకుండా పదవులకే పరిమితమైన వారి రెన్యువల్ చేయొద్దన్న చర్చ జరుగుతోందట. అలాంటి వారి జాబితా ఇప్పటికే రెడీగా ఉందట. ఏదేమైనా ఇక పార్టీకి ఉపయోగపడే నేతలకే బూస్టింగ్ ఉంటుందని మీనాక్షి ఖరాఖండీగా చెప్పేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తోనూ మీనాక్షి మాట్లాడినట్లు సమాచారం.

మూడు నెలల ప్లాన్

మూడునెలల్లో సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలన్న వ్యూహంతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, భర్తీచేయడంతో పాటు స్థానిక ఎన్నికలతో ఉత్సాహం నింపాలన్న యోచనలో పార్టీ ఉంది. ముందుగా రాష్ట్రకమిటీ, జిల్లా కమిటీలు ఖరారు చేసి మండల స్థాయి, గ్రామస్థాయి కమిటీలు కూడా నియమించాలన్న యోచనతో ఉంది. మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్నారు. అన్ని స్థాయిల్లో పార్టీ లో ఉత్సాహం నింపేలా పకడ్బందీ వ్యూహంతో.. పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల అనంతరం రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉగాదికి కమిటీలు ప్రకటించాలని పార్టీ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది.