సింగరేణి చరిత్రలో మరో గొప్ప వ్యాపార విస్తరణకు నాంది పడింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోని విద్యుత్ సంస్థతో కలిసి సంయుక్తంగా 3100 మెగావాట్ల సోలార్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందడుగు వేసింది. సోమవారం రాజస్థాన్ లోని జైపూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాజస్థాన్ ఇంధన శాఖ మంత్రి హీరాలాల్ నగర్ సమక్షంలో సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అధికారులు ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక ఘట్టమని, త్వరలోనే ఇది కార్యాచరణలోకి వస్తోందని, సింగరేణి వ్యాపార విస్తరణ, సుస్థిర భవిష్యత్ కోసం ఇది ఎంతగానో దోహదం చేస్తుందని భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్‌కు నిలయంగా.. రాజస్థాన్ రాష్ట్రం సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా దేశంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. పురోగతి పంథాలో సాగుతున్న ఈ రెండు రాష్ట్రాలు తమ భౌగోళిక పరిస్థితులను అవకాశాలుగా మలచుకోవడానికి పరస్పర సహకారంతో ముందుకు రావడంతో దేశ ఇంధన రంగంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అయిందన్నారు.
తెలంగాణ – రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఈ ఒప్పందం కీలకంగా మారనుందన్నారు. ఇరు సంస్థలు జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడి 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను, 1500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నాయని, పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలకు ఈ ఒప్పందం ఎంతో దోహదపడనున్నదని పేర్కొన్నారు.








