కరీంనగర్ – నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమరయ్యను గెలిపించి ఉపాధ్యాయులు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల నమ్మకంతోనే ఈ తీర్పు వెలువడిందన్నారు. ఈ తీర్పు టీచర్లకు, మోదీకే అంకితమన్నారు. కరీంనగర్ – నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా భారీ విజయం సాధించి గెలుపు పత్రాన్ని అందుకున్న మల్క కొమరయ్యను అభినందించేందుకు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మల్క కొమరయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
చారిత్రాత్మక తీర్పినిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5 వేల 900 ఓట్ల తేడాతో మల్క కొమరయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపట్ల నమ్మకంతో ఉన్నారు. ఇటీవల బడ్జెట్ లో ఉద్యోగులకు రూ.12.75 లక్షల దాకా పన్ను మినహాయింపు ఇవ్వడంపట్ల తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో బీజేపీ కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది.
ఆనాడు కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు వ్యతిరేకంగా ఆనాడు టీచర్ ఎమ్మెల్సీగా ఏవీఎన్ రెడ్డిని గెలిపించారు. 317 జీవోపై బీజేపీ కార్యకర్తలు చేసిన పోరాటాలు, లాఠీఛార్జ్ గుర్తుంచుకుని ఈనాడు మల్క కొమరయ్యను గెలిపించారు. తపస్ అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెళ్లుమన్పించేలా ఈరోజు తీర్పు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ కార్యకర్తల, నాయకుల కష్టం ఫలించింది. వారి పూర్తి సమయాన్ని కొమరయ్య విజయం కోసం క్రుషి చేశారు. టీచర్ల సమస్యలపై పోరాడే సత్తా బీజేపీకి, కొమరయ్యకే ఉందని భావించి ఈ భారీ విజయం అందించారు. ఈ విజయం ఉపాధ్యాయులకే అంకితం. మోదీకే అంకితం చేస్తున్నాం.
దురద్రుష్టమేమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉందని తెలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్కక్కై బీజేపీ అభ్యర్ధి కొమరయ్యను ఓడించాలని కుట్రలు చేశారు. ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేసినా వారి ఆటలను ఉపాధ్యాయులను సాగదీయలేదు.
కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది మూడో విజయం. ఆయన ఆధ్వర్యంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచాం. ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ గెలిచాం. రేపో ఎల్లుండో ప్రకటించబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది.
రాబోయే రోజుల్లో రామరాజ్యం వస్తుందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. మేమే ప్రధాన ప్రతిపక్షమని విర్రవీగుతున్న బీఆర్ఎస్ కు చెంప చెళ్లుమనేలా తీర్పు ఇచ్చారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్…
టీచర్ల సమస్యలపై పోరాడాల్సిన ఉపాధ్యాయ సంఘాలు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న తరుణంలో… తపస్ మాత్రమే టీచర్ల సమస్యలపై పోరాడుతోంది. ఇది గమనించి మద్దతు తెలిపిన ఉపాధ్యాయులకు వందనాలు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరేదొక్కటే. జాతీయవాదంతో ముందుకు సాగుతున్న తపస్ సంఘంలో టీచర్లంతా చేరాలని కోరుతున్నా.
బీసీ కులగణన పేరుతో ఒక వర్గానికే కొమ్ము కాస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం ఆ వర్గ అభ్యర్ధిని ఉపసంహరించేలా చేసి మైనారిటీలందరినీ ఏకం చేసి బీజేపీ అభ్యర్ధిని ఓడించాలని కాంగ్రెస్ కుట్ర చేసింది. అయినప్పటికీ టీచర్లు సరైన గుణపాఠం చెప్పారు. భారీగా చెల్లని ఓట్లు పోలవడం దురద్రుష్టకరం. దీనివల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మేధావి వర్గంపై ఉంది.
అనంతరం మల్క కొమరయ్య మాట్లాడుతూ….
బీజేపీ కార్యకర్తలు క్రుషి, తపస్ సహకారంవల్లే నేను ఎమ్మెల్సీగా గెలిచాను. నాపై నమ్మకం ఉంచి ఓటేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. 317 జీవోసహా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ముందున్న ప్రధాన ఎజెండా. నా గెలుపుకు సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తోపాటు నాయకులందరికీ క్రుతజ్ఝతలు.








