బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని మాటిచ్చి, ఓట్లు, సీట్లు దండుకుని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తారా అంటూ నిలదీశారు. సీసీఐపైనే కోటి ఆశలు పెట్టుకుని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? వారి ఆర్థనాదాలు వినిపించడం లేదా మండిపడ్డారు. ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్లైన్లో టెండర్లు పిలవడం, సీసీఐ సంస్థ గొంతు కోయడమేనన్నారు. నిర్మాణ రంగంలో సిమెంటుకున్న డిమాండ్ దృష్ట్యా సీసీఐని ప్రారంభించి కార్మికులను కాపాడాలని కేంద్రమంత్రులకు మొరపెట్టుకున్నా కనికరించకపోవడం ఆదిలాబాద్‌కు వెన్నుపోటు పొడవడమేనని చెప్పారు.








