భయం లేదు.. భయం లేదు.. ధైర్యమే నా ఆయుధం. ఓడినా ముందుకే అడుగేశాం, ఈ రోజు చరిత్ర తిరగరాశాం. మనం నిలబడ్డాం, నాలుగు దశాబ్దాల టిడిపిని నిలబెట్టాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ గర్జించారు. నిర్భంధాలను చిత్తు చేసి.. అధికార పీఠం ఎక్కిన తీరును ప్రస్తావించారు. అన్యాయాన్ని, అక్రమాలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని ఉద్ఘాటించారు.
అసెంబ్లీ గేటు తాకలేవు అన్నారు.. బద్దలుకొట్టాం
ఇల్లేమో దూరం.. చేతిలో దీపం లేదు.. గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే.. అన్నీ ఒక్కడినే ఐ.. 2014 లో జనసేన పార్టీ స్థాపించాను. భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాను. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు, జబ్బలు జరిచారు, తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. ప్రజలను హింసించారు. ఇదేమి న్యాయం అని మన జనసైనికులు, వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమంగా జైలులో బంధించారు. వారి పార్టీ సీనియర్ నాయకులను రోడ్డు మీద రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడిపై చేయని కుట్ర లేదు, తిట్టని తిట్టు లేదు, వేయని నిందలు లేవు. ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం.
తెలంగాణలోనే జన్మస్థలం
తెలంగాణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మ స్థలం తెలంగాణ అయ్యింది.. కర్మ స్థలం ఆంధప్రదేశ్ అయ్యింది. కృష్ణమాచార్య మాటలు.. మాకే కాదు.. మన ప్రజలకు ఊతమిచ్చాయి. నా గుండె లోత్తుల్లో నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. మూగబోయిన కోటి మంది తమ్ముళ్ల గళాన్ని వినిపించిన నా తెలంగాణా కోటి రతనాల వీణ. అలాంటి కోటి ధివిటీల కాంతి జ్యోతి తెలంగాణా. ఆనాడు కరెంటు షాక్ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాకు చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి ఆశీస్సులు.. నన్ను ప్రేమించే ప్రజల దీవెన నాకు ఊపిరి ఇచ్చింది. అలాంటి తెలంగాణ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బండెనక గట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ కాళ్లకు గజ్జె కట్టి.. చేతికి కర్ర పెట్టి.. ఆటని, పాటని ఆయుధంగా మలిచిన వాడు.. యువతలో స్పూర్తిని నింపినవాడు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే.. మన దగ్గర లేని నా గద్దరన్న. మా ఆడపడుచులు, వీర మహిళల స్పూర్తి, పోరాటాన్ని నేను మరువను. మీరంతా రాణి రుద్రమలు.. జనసేన వీరమహిళలు.. అందరి క్షేమం కాంక్షించే సూర్య కిరణాల లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ భీమ్‌లు.. మా జనసేన వీర మహిళలు అంటూ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో పవన్ కల్యాణ్ సరికొత్త జోష్ నింపారు. సభలో ఎమ్మెల్సీ నాగబాబు, నాదెండ్ల మనోహర్, బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.








