కోడి పందేలు, క్యాసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. ఆయనతో పాటు న్యాయవాది, ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్న వ్యక్తి వచ్చినా పోలీసులు లోపలికి అనుమతించలేదు. మొయినాబాద్ పోలీసులు నోటీసు ఇవ్వడంతో విచారణకు హాజరైనట్టు తెలిపిన పోచంపల్లి.. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు వివరించారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని, ఫామ్‌హౌస్ లీజు వివరాలు అడిగితే చెప్పానని తెలిపారు. గత నెల 11న మొయినాబాద్ తొల్కట్ట గ్రామంలోని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. 61 మందిపై కేసు నమోదు చేశారు. ఫామ్‌హౌస్ యజమాని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి విచారణకు హాజరు కావాలని ఫిబ్రవరి 13న నోటీసులు ఇచ్చారు. న్యాయవాదిని పంపి సమాధానం ఇచ్చిన శ్రీనివాస్‌రెడ్డి.. ఫామ్‌హౌస్ లీజుకు ఇచ్చానని తెలిపారు. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా ఇవాళ విచారణకు హాజరయ్యారు.








