డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మార్చి 24, 25 తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-యూఎఫ్‌బీయూ తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్- ఐబీఏతో జరిగిన చర్చలు ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల యూఎఫ్‌బీయూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఐబీఏతో జరిగిన సమావేశంలో అన్ని యూఎఫ్‌బీయూ సభ్య సంఘాలు – అన్ని కేడర్లలో నియామకాలు, ఐదు రోజుల పనివారం వంటి సమస్యలను లేవనెత్తాయి. అయినప్పటికీ కీలక సమస్యలు పరిష్కారం కాలేదని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్-ఎన్ సీబీఈ ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ తెలిపారు.
తొమ్మిది బ్యాంకు ఉద్యోగుల సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ- ప్రభుత్వ రంగ బ్యాంకులలో వర్క్‌మెన్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయడం వంటి డిమాండ్ల కోసం ఒత్తిడి తీసుకురావడానికి ఇంతకుముందు సమ్మెను ప్రకటించింది. పని తీరు సమీక్షలు, పని తీరు-సంబంధిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం- డీఎఫ్ఎస్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కూడా యూనియన్లు కోరాయి. డీఎఫ్ఎస్ ఆదేశాలు ఉద్యోగ భద్రతకు ముప్పు కలిస్తాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆంతేకాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లో డీఎఫ్ఎస్ “మైక్రో మేనేజ్మెంట్” అనేది సబబు కాదని వాదించాయి. ఇలాంటి జోక్యాలు బ్యాంకు బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని చెప్పాయి. ఇవే కాకుండా సీలింగ్‌ను రూ.25 లక్షలకు పెంచేలా గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు వంటి డిమాండ్లను కూడా ఉద్యోగ సంఘాలు ఐబీఏ ముందు ఉంచాయి.
యూఎఫ్‌బీయూలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్ సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఉన్నాయి.








