Mahaa Daily Exclusive

  రాజకీయ భాష మారాల్సిన అవసరం ఉంది – శాసనసభలో సీపీఐ నేత కూనమనేని

Share

రాజకీయాల్లో విమర్శల కంటే ఒకరిపై ఒకరి తిట్ల పురాణాలే ఎక్కువవుతున్నాయని సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం సభలో మాట్లాడిన కూనమనేని భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా తట్టుకుంటున్నారో కానీ.. తమపై చిన్న ఆరోపణ వచ్చినా తట్టుకోలేపోతున్నామని కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు. రాజకీయ విమర్శల కంటే తిట్ల దండకాలే ఎక్కువగా ఉంటుండటం శోచనీయమన్నారు. నేతలు మాట్లాడుతున్న బాషపై సామాన్య ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే.. ప్రస్తుత పరిస్థితులు.. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అనుకునేలా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

భావ ప్రకటన స్వేచ్ఛ పేరు చెప్పి కొందరు దుర్భాషలాడుతున్నారని కూనమనేని తెలిపారు. ఇలాంటి దుర్భాషను ఎక్కడ నేర్చుకున్నారని, పక్కనున్న ఏపీ నుంచి నేర్చుకున్నారా అంటూ మండిపడ్డారు. ఇలాంటి భాష ఎవరు వాడినా తప్పేనని.. రాజకీయ నాయకులు అంటే ఎన్ని తిట్టినా పడతారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నేతలను ఎన్ని తిట్టినా ఏమి చేయలేరనే అలసత్వం పెరిగిందా అని దుయ్యబట్టారు. ఈ విద్వేషకరమైన భాషను మాట్లాడే పద్ధతిని ఎక్కడున్నా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూనమనేని అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి భాష లేదన్న కూనమనేని రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచే ఈ సంప్రదాయం మొదలైందన్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకొని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి ఎలా పడుతున్నారో తెలియదు కానీ.. తమ మీద చిన్న ఆరోపణ వచ్చినా తట్టుకోలేకపోతున్నామని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క రాజకీయ నాయకులలోనే కాదని జర్నలిజంలో కూడా ఉందన్నారు. తన జీవితం కూడా జర్నలిజం నుంచే మొదలైందని, కానీ అలాంటి భాష వాడేవాళ్లం కాదని తెలిపారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సహా నాయకులంతా ఒక రోజు సమయం కేటాయించి పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రైతుల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోందని కూనమనేని పేర్కొన్నారు. చిన్న ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయని, కానీ అది చిరు ఉద్యోగులకు అందడం లేదన్నారు. వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దయచేసి వారికి కూడా సమయానికి జీతాలు చెల్లించాలని కోరారు. కొత్తగూడెం విమానాశ్రయం గురించి మాట్లాడుతూ కొత్తగూడెం ఎయిర్ పోర్టు ప్రతిపాదన కూడా ఎన్నో ఎళ్లుగా ఉందన్నారు. కొత్తగూడెం, రామగుండంలో విమానాశ్రయాల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. అయితే కొత్త విమానాశ్రయాలు రాకుండా ఎవరో కుట్ర ప్రన్నుతున్నారని తాను విన్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు.