సోషల్ మీడియాలో హద్దు మీరుతున్న వారిని ఊరుకునే ప్రసక్తేలేదు.. ఒక్కొక్కడి తోడ్కలు తీస్తా. బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిచారు. శనివారం శాసన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీస్ లోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెటితే వాటిపై పోలీసుల కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు. దానికి బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుంది. సోషల్ మీడియాలో వాళ్లు పెట్టిన భాష ఓ సారి వినండి. జర్నలిస్టుల ముసుగులో మమ్మల్నీ మా ఇంట్లోని మహిళలపై ఇష్టారీతిలో తిట్టిస్తున్నారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. ప్రజాజీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నా. ఆ భాష వింటే రక్తం మరుగుతుంది. కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే మీరసలు మనుషులేనా? మీకు భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, మీ చెల్లినో, మీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే మీరు వింటారా? అని ప్రశ్నించారు. నా భార్య, బిడ్డను తిటుతుంటే నాకు నొప్పి అవుతుంది. కానీ ఓ ఆడబిడ్డను అవమానిస్తుంటే మీకు నొప్పికాదా? ఏ సంస్కృతిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా చెబుతున్నా.. ఒక్కొక్కరి తోడ్కలు తీస్తా. రాజకీయ జీవితంలో ఉన్నది మేము మమ్మల్ని విమర్శించండి. మా పనితీరుపై విశ్లేషించాలన్నారు. ఆ రకమైన భాషను ఆడపిల్లలే రికార్డు చేయించి తమ ప్లాట్ ఫామ్ లపై పోస్టులు చేస్తే ఇది మంచి పద్దతా అని నిలదీశారు. ఇలాంటి వారు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటామనుకుంటున్నారేమో అవసరం అయితే చట్టాన్ని సవరిస్తామన్నారు. వీటిని క్షమించే ప్రసక్తే లేదు. ఉప్పుపాతరేస్తా అని హెచ్చరించారు.
జర్నలిస్టులకు అర్ధమేంటి?
జర్నలిస్టు అనే పదానికి అర్థం ఏంటో జర్నలిస్టు సంఘాలు చెప్పాలని సీఎం అన్నారు. ఎవరు జర్నలిస్టులో లిస్టు ఇవ్వండి. ఆ జాబితాలో ఉన్నవారు ఇలా తప్పుచేస్తే ఏ శిక్ష విధిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేని వారిని క్రిమినల్ కిందనే చూస్తామన్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా, యూ ట్యూబ్ ఛానెళ్లు పెట్టుకొని అసభ్య పదజాలంతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడే వాళ్లు జర్నలిస్టులా? లేక ఐ అండ్ పీఆర్, డీఏవీపీ ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు ఇచ్చే ఐడీ కార్టులు కలిగిన వారు జర్నలిస్టులా అని ప్రశ్నించారు. ఐ అండ్ పీఆర్ మంత్రి జర్నలిస్టు సంఘాలతో సమావేశం కావాలని సూచిస్తున్నాన్నారు. ఓపికతో మర్యాదతో ఉంటున్నారు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది మా పిల్లలు రోడ్లమీదకు వచ్చి ఒక్కొక్కడి బట్టలూడదీసి కొడతారు. చట్టాలపై సంపూర్ణమైన నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి ఏమనకుండా ఊరుకుంటున్నాం. అది మా చేతగాని తనం అనుకోవచ్చని హెచ్చరించారు. కుర్చీలో ఉన్నానని అన్ని భరిస్తానని అనుకోవద్దు. చట్టపరిధిలోనే అందరి భరతం పడుతాను. ఎక్కడో దగ్గర దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసంరం ఉంది. స్పీకర్ అనుమతితో ఒక రోజు దీనిపై చర్చ చేద్దామన్నారు.








