Mahaa Daily Exclusive

  రైల్వేల సమగ్రభివృద్ధికి కట్టుబడి ఉన్నాం విమానాశ్రయం తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్‌ త్రిభాషా విధనం కొత్తదేం కాదు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Share

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించిన కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని, మరో 10 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని, విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

అందరూ మహిళలే

రూ.26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయని, మరో రూ.12 కోట్లతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దశల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ ద్వారా స్వచ్ఛ రైల్వేస్టేషన్ పేరుతో వినూత్న మార్పులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని కూడా అధునాతనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నామని, బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తామన్నారు.

త్రిభాషా విధానం కొత్తదేం కాదు

త్రిభాషా విధానం దేశంలో కొత్తది ఏమీ కాదని, కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదని, ఏ భాష కావాలంటే అందులో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి రూ.కోట్లు లాభాలను నిర్మాతలు పొందుతున్నారని, వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదని అన్నారు. సీఎంగా స్టాలిన్ ఏం చేశాడో చెప్పి తమిళనాడు ప్రజల్ని ఓట్లు అడగాలన్నారు. ఆయనేం చేయలేదు కాబట్టే భాష పేరు మీద దుష్ప్రచారం చేస్తూ ఎన్నికలు దాటేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పునర్విభజనకు సంబంధించి 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదని, డీ లిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయనేది దుష్ప్రచారం మాత్రమేనని అన్నారు.