భారత దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పిరావటంతో హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆయనను వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. డాక్టర్లు రెహమాన్‌కు యాంజియోగ్రామ్, ఈసీజీ వంటి టెస్టులు నిర్వహించి డిహైడ్రేషన్, మెడకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు నిర్ధారించారు. కొద్ది పాటి చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అస్వస్థతకు గురైన రహమాన్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలియడంతో ఆయన అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే, తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారనే వార్తలను ఆయన సోదరి రిహానా ఖండించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యల కారణంగా అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లామని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. డీహైడ్రేషన్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్‌కు రొటీన్ చెకప్స్ నిర్వహించి డిశ్చార్జి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్డేట్
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరాడన్న వార్తల నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అప్డేట్ ఇచ్చారు. రెహమాన్ ఆరోగ్యంగా ఉన్నారన్నారు. “అనారోగ్యంతో ఏఆర్ రెహమాన్ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే డాక్టర్లను సంప్రదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. రెహమాన్ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే ఆయనను ఇంటికి పంపుతామని వైద్యులు తెలిపారు” అని స్టాలిన్ రహమాన్ డిశ్చారిజికి ముందు ఎక్స్ లో పేర్కొన్నారు.








