Mahaa Daily Exclusive

  ఆడపిల్లలు ఇంటికి వెలుగునిచ్చే మణి దీపాలు……. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్..!

Share

ఖమ్మం, మే -07:మహా.
ఆడపిల్లలు ఇంటికి వెలుగునిచ్చే మణి దీపాలని, ఆడపిల్లల సంరక్షణ భాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

ఆడపిల్లలు పుట్టడం అదృష్టమని తెలుపుతూ, ప్రతి బుధవారం జిల్లా వ్యాప్తాంగా నిర్వహిస్తున్న మా పాప – మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా రఘునాధపాలెం మండలం జింకలతండా గ్రామంలో బేగం కుటుంబ సభ్యులు, అంగన్వాడి టీచర్లు అందంగా ఇంటిని ఆలంకరించి ఆడపిల్లలను పుట్టనిద్దాం.. ఆడపిల్లలను పెరగనిద్దాం అనే నినాదాలతో ముగ్గులు వేసి కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. బేగం షరీఫ్ దంపతులకు 25 మార్చి, 2025న ఆడపిల్ల పుట్టిన విషయం తెలిసి, వారి ఇంటికి వచ్చిన జిల్లా కలెక్టర్, పాప తల్లిదండ్రులతో పాటు నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ లను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. చేతులతో పాపను ఎత్తుకొని లాలిస్తూ పాప చిరునవ్వుకు కలెక్టర్ మురిసిపోయారు. సమాజానికి ఆడపిల్లల ఆవశ్యకత ఏలాంటిదో వివరించారు. కలెక్టర్ ఆలోచనతో పాటు ఆచరణ పట్ల గ్రామస్ధులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆడపిల్లలే ఇంటికి మణి దీపాలు అని, ప్రస్తుత ఆధునిక యుగంలో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీపడుతూ దూసుకెళ్తున్న మహిళలు ఏ రంగంలో తక్కువ కాదు అని నిరూపిస్తున్నారని అన్నారు. కుటుంబ వ్యవస్ధలో, సమాజం అత్యాధునిక అభివృద్ది పదంలో కొనసాగటానికి ప్రధాన భూమిక మహిళలదే అని, మహిళలను బాల్యం నుండే ప్రోత్సహించి దేశ అభ్యున్నతికి అందరూ కృషి చేయాలని తెలిపారు.

ఆడబిడ్డలను గొప్ప స్ధానంలో ఎదిగేందుకు, ఎవరికి తక్కువ కాకుండా పెంచాలని, మనం ఆశించే మార్పు మన ఇంటి నుండే ప్రారంభించాలని, అమ్మాయిలు కుటుంబానికి అమ్మగా ఉంటుందని, అన్ని బంధాలకు మాతృప్రేమ పంచేవారని అన్నారు. సమాజంలో అమ్మాయి పుడితే అదృష్టంగా భావించాలని కలెక్టర్ అన్నారు.

మహిళా శిశు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా జిల్లా అధికారులు వెళ్లి తల్లిదండ్రులకు స్వీట్ బాక్స్ ఇచ్చి, మంచి సందేశం అందించాలని, మహాలక్ష్మి ఇంట్లో పుట్టినందుకు శుభాకాంక్షలు తెలిపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, రఘునాధపాలెం మండల తహసీల్దారు లూథర్ విల్సన్, ఎంపీడివో అశోక్ కుమార్, ఆర్ఐ ప్రవీణ్, ఆంగన్ వాడి టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.