ఖమ్మం, మే 7:మహా.
నగర శుభ్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఖమ్మం నగరపాలక సంస్థ ఆధునిక మెకానైజ్డ్ స్లీపింగ్ మిషన్‌ను సేవలోకి తీసుకొచ్చింది. పాత విధానాలకు స్వస్తి పలుకుతూ, కొత్త యాంత్రిక వ్యవస్థను ప్రవేశపెట్టిన పురపాలక సంస్థ, నగర నిర్మాణంలో కీలక మైలురాయిగా ఈ పద్ధతిని పేర్కొంది.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్లీపింగ్ మిషన్ రోజుకి సుమారు 60 కిలోమీటర్ల రహదారులను శుభ్రం చేయగలదు. మానవ శ్రమను గణనీయంగా తగ్గించడంతో పాటు, నగర శుభ్రత పనుల్లో వేగం, నాణ్యత సాధ్యమవుతుందని అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ సర్కిల్ నుండి బల్లేపల్లి స్టేజ్ వరకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. ఈ ప్రయోగాత్మక పరీక్ష ద్వారా మిషన్ సామర్థ్యాన్ని అవగతం చేసుకొని, త్వరలో నగరంలోని ఇతర ప్రధాన రహదారులపై దీన్ని అమలులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ, “ఖమ్మం ప్రజలకు పరిశుభ్రమైన జీవనవాతావరణం కల్పించేందుకు మెకానైజ్డ్ శుభ్రత పద్ధతి కీలకంగా నిలుస్తుంది. పౌరులకు ఆరోగ్యకరమైన జీవితం అందించాలన్నదే మా లక్ష్యం,” అని తెలిపారు. యాంత్రిక శుభ్రత విధానాలు విశ్వసనీయత, వేగం, సమర్థత వంటి అంశాల్లో కీలకంగా నిలుస్తాయని, త్వరలో మరిన్ని మిషన్లను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
నగర శుభ్రతతోపాటు, శ్రమదారుల భద్రత, సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ చర్యపై పౌర సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇకపై మానవీయ శ్రమపై ఆధారపడకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నగర శుభ్రత పనులు కొనసాగనున్నాయి.
ఇలాంటి ఆధునిక చర్యలతో ఖమ్మం నగరం త్వరలోనే మోడల్ మునిసిపాలిటీల జాబితాలో స్థానం దక్కించుకోవడం ఖాయం.








