Mahaa Daily Exclusive

  ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ..!

Share

హన్మకొండ మహా;

హన్మకొండ పోలీస్ కమీషనరేట్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మంత్రి కొండా సురేఖ, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ పరేడ్ ను పర్యవేక్షించారు. వివిధ పోలీస్ విభాగాలు పరేడ్ లో పాల్గొన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, జిల్లా సమగ్ర ప్రగతి ని వివరిస్తూ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సందేశం ఇచ్చారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబ సభ్యులను మంత్రి కొండా సురేఖ సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, ఆర్టీసీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, పౌరసరఫరాలు, మత్స్య, తదితర శాఖలు ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ తయారు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ఆకట్టుకునేలా రూపొందించిన ఆయా శకటాల సంబంధిత శాఖల అధికారులకు మంత్రి కొండా సురేఖ అభినందనలు తెలిపారు. పలు గీతాలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర జిల్లా అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ముందుగా అదాలత్ జంక్షన్ లోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.