Mahaa Daily Exclusive

  కనుల పండువగా జగన్నాథుడి రాథోత్సవం..!

Share

ఆదిలాబాద్, మహా

ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో శనివారం నిర్వ‌హించిన జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర అత్యంత వైభ‌వోపేతంగా, క‌న్నుల పండువ‌గా సాగింది. పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో పుర‌వీధులు జ‌న‌సంద్రంగా మారాయి. హ‌రే రామ‌, హరే కృష్ణ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగాయి. శోభాయాత్ర‌లో భాగంగా ఇస్కాన్ స‌భ్యులు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి చేసిన భ‌జ‌న కీర్త‌నలు, పాడిన భ‌క్తిపాట‌లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అటు మ‌హిళ‌లు, భ‌క్తుల ల‌య‌బ‌ద్ధ నృత్యాలు అల‌రించాయి. అంత‌కుముందు మ‌థుర జిన్నింగ్ ఆవ‌ర‌ణలో దేవతామూర్తుల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం పూల‌తో అందంగా అలంక‌రించిన‌ వాహ‌నంలో ఉంచి శోభాయాత్ర‌ను ప్రారంభించారు. దేవ‌త‌ల వేషాధార‌ణ‌లో చిన్నారులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. శోభాయాత్ర‌లో ఇస్కాన్ ప్ర‌తినిధులు, ప‌ట్ట‌ణ ప్ర‌ముఖులు, మ‌హిళ‌లు, భ‌క్తులు భారీ సంఖ్య‌లో హాజ‌రై ర‌థాన్ని తాడుతో లాగారు. పూరిలో అత్య‌ద్భుతంగా జ‌రిగే ఉత్స‌వాన్ని మ‌రిపించేలా జిల్లాకేంద్రంలో రథ‌యాత్ర మ‌హోత్స‌వం కొన‌సాగింది. శోభాయాత్రలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని దేవత మూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. రహదారులను శుభ్రం చేసి రథాన్ని తాడుతో లాగారు. జై జగన్నాథ నామ స్మరణ చేస్తూ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. ప‌లువురు స్వ‌చ్ఛంద సంస్థ‌ల నిర్వాహ‌కులు, వ్యాపారులు భ‌క్తుల‌కు ప్ర‌సాదాల విత‌ర‌ణ చేప‌ట్టారు. శోభాయాత్ర‌తో ప్ర‌ధాన వీధుల‌న్నీ శోభాయ‌మానంగా మారాయి. జ‌గ‌న్నాథుని దీవెన‌ల‌తో ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల ఉండాల‌ని, సౌభ‌గ్యాల‌తో విల‌సిల్లాల‌ని, అంతా శుభం క‌ల‌గాల‌ని ఇస్కాన్ ప్ర‌తినిధులు ఆకాంక్షించారు. లోక క‌ళ్యాణార్థ‌మే ప్ర‌తియేటా త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో దేశ‌విదేశాల్లో వేడుకలు నిర్వ‌హిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.