ఇల్లెందు, మహా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిన సిపిఐ 18వ పట్టణ మహాసభలో ప్రజా సమస్యలపై స్పష్టమైన ధ్వని వినిపించింది. కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఈ సభకు బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “ఆపరేషన్ కగార్” పేరుతో మావోయిస్టులపై దాడులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఉపాధి అవకాశాలు పెంచాలని, నిత్యవసర ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో తాగునీరు, వైద్యం, విద్య ఇంకా మెరుగుదల అవసరమన్నారు. ప్రజలతో భాగస్వామ్యంగా పని చేయాల్సిన అవసరముందని సూచించారు. సింగరేణి గనులపుట్ట ఇల్లెందులో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం బాధాకరమన్నారు. జెకె 5 ఓసి ప్రాజెక్టు విస్తరణ వల్ల భూములు కోల్పోయిన వారికి ప్యాకేజీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇల్లెందులోని 8 వేల ఇండ్లకు 76వ జీఓ ద్వారా పట్టాలు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల్లో అర్హులైన వారికి న్యాయం చేయాలని చెప్పారు. నిర్వాసితుల హక్కుల కోసం సిపిఐ, ఏఐటీయుసీ కలిసి పోరాడతామని తెలిపారు.
ఈ సభలో సిపిఐ రాష్ట్ర నేతలు మిర్యాల రంగయ్య, కె.సారయ్య, దేవరకొండ శంకర్, ఎండి.నజీర్, దాసరి రాజారాం, బాస శ్రీనివాస్, ఉడుత ఐలయ్య, బంధం నాగయ్య, చాట్ల గణపతి, కమటం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.








