Mahaa Daily Exclusive

  ఆగ్రోఫారెస్ట్రీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్..!

Share

ఖమ్మం, మహా.
దేశ వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో వృక్ష సంపదను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ఆగ్రోపరిష్కారానికి నాంది పలికింది. వాతావరణ మార్పులు, ప్రకృతి పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి – ఈ మూడు లక్ష్యాలను ఒకే దారిలో చేరుస్తూ, వృక్షాల పెంపకానికి కొత్త మార్గాలను తెరిచింది. వ్యవసాయ భూముల్లో చెట్లు నాటి, వాటిని నరికి, రవాణా చేయడం మొదలైన ప్రక్రియలను దశలవారీగా సులభతరం చేస్తూ నమూనా నిబంధనలను రాష్ట్రాలందరికీ పంపింది. ఈ చర్యల ద్వారా ఒకవైపు రైతులకు అధిక ఆదాయం లభిస్తే, మరోవైపు పర్యావరణ పరిరక్షణలోనూ దేశం ముందడుగు వేస్తుంది.

వ్యవసాయ రంగానికి పునాది వలె నిలిచే విధంగా, కేంద్ర పర్యావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆగ్రోఫారెస్ట్రీగా ప్రసిద్ధిపొందిన వ్యవసాయ భూముల్లో వృక్షాల పెంపకాన్ని ముమ్మరంగా ప్రోత్సహించేందుకు గాను, చెట్ల నరికివేతను సులభతరం చేసే నమూనా నిబంధనలు రాష్ట్రాలకు పంపించింది. ఈనెల 19న జారీ చేసిన లేఖలలో స్పష్టంగా రైతులకు మద్దతుగా ఉన్న ఉద్దేశాలు ప్రతిఫలించాయి.

ఇప్పటివరకు వ్యవసాయ భూముల్లో వృక్షాలను నరకాలంటే అనేక అనుమతులు, విచారణలు, రెవెన్యూ అధికారుల అడ్డంకులు ఎదురయ్యేవి. ఇది రైతుల్లో నిరుత్సాహానికి దారి తీసింది. ఇదే ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి ప్రధాన అవరోధమని కేంద్రం గుర్తించి, ఆ అవరోధాన్ని తొలగించే దిశగా స్పష్టమైన మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

* ఎస్‌ఎల్‌సీల కీలక బాధ్యత:

2016 నాటి ‘కలప ఆధారిత పరిశ్రమల మార్గదర్శకాలు’ కింద ఏర్పాటైన రాష్ట్రస్థాయి కమిటీలైన ఎస్‌ఎల్‌సీలు ఈ కొత్త నిబంధనల అమలుకు కీలక పాత్ర పోషించనున్నాయి. వీటివల్ల చెట్లను నరికి, కలపను రవాణా చేయాలంటే ఎక్కడికక్కడ అనుమతులు కావాల్సిన అవసరం లేకుండా అవతలవుతుంది.

* ఎన్‌టీఎంఎస్ పోర్టల్‌తో పూర్తి డిజిటలీకరణ:

ప్రక్రియ మొత్తాన్ని జాతీయ టింబర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌కి తీసుకువచ్చారు. చెట్లు నాటే రైతులు తమ భూమి, నాటిన తేదీ, చెట్ల జాతి, ఎత్తు వంటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి చెట్టు జియోట్యాగ్ చేసి, ఫొటో అప్‌లోడ్ చేయాలి. తరువాత నరికే సమయంలో మళ్లీ ఫోటోలు అప్లోడ్ చేసి, నరికే తేదీని తెలపాలి. దీనితో పాటు ఆటోమేటిక్‌గా నిరభ్యంతర సర్టిఫికెట్ జారీ అవుతుంది.

* రైతులకు లాభం.

ఈ విధానం వల్ల రైతులు తమ భూముల్లో వేయే వృక్షాలను భవిష్యత్‌లో ఆదాయ వనరుగా మలచుకోవచ్చు. పర్యావరణానికి హానికరం కాకుండా చెట్లను నరికి, కలపను అమ్ముకోవచ్చు. ఇదే సమయంలో కార్బన్ ఫుట్‌ప్రింట్ తగ్గి, భూ ఉపరితల ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడుతుంది.

* ఆదాయానికి అడుగు.

ఈ కొత్త మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా ఫార్మ్ ఫారెస్ట్రీ, సోషియో ఎకానమిక్ కలప ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక వనాల అభివృద్ధికి బీజాలు వేస్తున్నాయి. రైతులకు ఇది పంటల మధ్యకాలంలో స్థిర ఆదాయ మార్గాన్ని కల్పించే ప్రయత్నం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని సమర్థంగా అమలు చేస్తే, దేశవ్యాప్తంగా పచ్చదనం విస్తరించి, వ్యవసాయ రంగానికి కొత్త ప్రాణం పోసే అవకాశముంది.