ఖమ్మం అర్బన్,మహా.
పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు సాగించి పేదల పక్షపాతిగా సిపిఐ నిలిచిందని ఆయన తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని బైపాస్‌రోడ్డులో గల గిరిప్రసాద్ భవన్ లో సిపిఐ టూటౌన్ మహాసభ ఎస్ కె సైదా, బోడా వీరన్న అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాటాలు సాగిస్తుందని తెలిపారు. ఖమ్మం నగరంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సిపిఐదే అన్నారు. నగర జనాభా పెరుగుతున్న క్రమంలో దానికి అనుగుణంగా వసతుల కల్పన జరగాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కోరారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారాలు మోపుతూ సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజలకు అవసరమైన వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక, కర్షక, పేద, సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు సాగించాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సభలో డిసెంబర్లో జరుగుతుందని ఈ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాటాలు సాగించాలన్నారు. ఈనెల ఆరున జరిగే ఖమ్మం నగర మహాసభను జయప్రదం చేయాలని అదేవిధంగా మధిరలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభల్లో ప్రజా సమస్యలే ఎజెండాగా కార్యాచరణ రూపొందించి వాటి పరిష్కారానికి పోరాటాలు సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్
కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్కె జానిమియా, మహ్మద్ సలాం, బిజి క్లెమెంట్, పోటు కళావతి, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, అజ్మీర రామ్మూర్తి, తాటి నిర్మల, యానాలి సాంబశివరెడ్డి, వరదా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.








