రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జిల్లాలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ముస్లింలు, హిందువులు కలిసి జరుపుకునే మొహర్రం పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మహ్మద్ ప్రవక్త మనవళ్ళు హసన్, హుస్సేన్ బలిదానానికి ప్రతీక అయిన మొహర్రం పండుగను ఆదివారం ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో కన్నులపండుగగా జరుపున్నారు… పీర్లచావిడి దగ్గర కోలువుదీరిన పీర్లను సందర్శించిన భక్తులకు చెక్కర, పాలతో తయారు చేసిన పానకాన్ని అలాగే ప్రసాదాలను పంచిపెట్టారు. చాదార్లను ముజావర్లకు సమర్పించి పీర్లకు అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు.. అలాగే గ్రామములోని వీదులకు పీర్లను ఊరేగింపుగా తిప్పారు. అంతకంటే ముందు పీర్ల చావిడి ముందు అలయ్‌లో అగ్ని గుండం రాజేసి దానిచుట్టూ అలయ్, బలయ్ ఆడుతూ కాలక్షేపం చేశారు. కుల మతాలకతీతంగా గ్రామంలోని ప్రతి ఇంటి గడప చాదర్ దట్టి, తీర్థ ప్రసాదాలను తీసుకొని, పీర్లను గుమ్మం ముందు ఉంచి నీటితో పీల్లరను కాళ్లు కడిగించి ఆశీర్వాదం తీసుకున్నారు. ముజావర్ల ఆద్వర్యంలో ప్రార్ధనలు చేసారు.. భక్తులకు మొహర్రం యొక్క విశిష్టతను వివరించారు. అమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల వివిధ గ్రామాల్లో పీర్ల పండుగ వారం రోజులపాటు కొనసాగింది. హిందూ ముస్లిం తేడాలేకుండా అందరూ కలిసికట్టుగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకొన్నారు. భక్తులు పీర్లకు దట్టీలు సమర్పించి మలీద, మటికలతో ఫాతెహాలు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మండల కేంద్రంలోని పీర్లచావిడీ వద్ద పెద్దసంఖ్యలో భక్తులు అలావ్ చుట్టుగా చిందులు తొక్కుతూ అసోయ్‌దూలా అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రందాకా పీర్లను ఎత్తుకొని ఆటలాడారు. పీర్ల పండుగ సందర్భంగా వివిధ రకాల వేషధారణలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాత్రివేళ కులమతాలకు అతీతంగా అలయ్ ఆడుతూ సంబురాలు జరుపుకొన్నారు. సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు, పీర్లకు మొక్కులు తీర్చకోవడానికి తిరిగి స్వగ్రామానికి చేరుకోవడంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. గ్రామంలో మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. గ్రామాలలో గ్రామ ప్రజలందరూ కలిసిమెలసి పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు యువకులు, పెద్దలూ ఉపవాసదీక్ష ఉన్నారు. గ్రామాల్లో ఇప్పటికి పీర్లచావిడి వద్ద ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడవడం ఆనవాయితీతో గుండంలో నడిచారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గోని తిలకించారు… ఊరేగింపు అనంతరం పీర్లను నిమజ్జనం చేశారు.







