మంచిర్యాల, మహా : ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఉద్యమంగా చేపట్టాలని
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం జైపూర్ మండలం పెగడపల్లి, టేకుమట్ల గ్రామాలలో వన మహోత్సవం -2025 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యతగా మొక్కలు నాటి కాలుష్య నియంత్రణకు, మొక్కల సంరక్షించాలని పాటుపాడాలని పేర్కొన్నారు. ఇప్పుడు నాటిన మొక్కలే భవిష్యత్తులో వృక్షాలై వాతావరణ సమతుల్యత కాపాడుతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సాధించే విధంగా సమన్వయంతో పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెగడపల్లి గ్రామంలో 1000 మొక్కలు, టేకుమట్ల గ్రామంలో 600 మొక్కలు నాటినట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించి తరగతి గదిలో విద్యార్థినులతో మాట్లాడి వారి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో సకల సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహారీగోడ, వంటశాల ఇతర అన్ని మౌళిక సదుపాయాల నిధులు కేటాయించి పనులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వర్షాకాలం కావడంతో పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టి వర్షాకాలంలో వ్యాధులను అరికట్టాలని సూచించారు.
అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండల తహశిల్దార్ వనజారెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుర్రం సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








