Mahaa Daily Exclusive

  స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఉత్సాహంగా వన మహోత్సవం. మొక్కలు నాటిన చిట్టి చేతులు. ఆకట్టుకున్న వన మహోత్సవ అవగాహన ర్యాలీ. ..!

Share

ఖమ్మం సిటీ, మహా.

పర్యావరణాన్ని పరిరక్షించాలని కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలని సందేశం ఇస్తూ స్థానిక స్మార్ట్ కిడ్జ్ చిన్నారులు శుక్రవారం వన మహోత్సవాన్ని బాధ్యతాయుతంగా, ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో , పాఠశాల మైదానంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా పాఠశాల విద్యార్థులు తమ చిట్టి చేతులతో పలు రకాల మొక్కలను నాటారు.తాము వివిధ రకాలుగా సేకరించిన మొక్కలను ప్రత్యేకంగా గుంతలు తీసి ఆ గుంతల్లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు , ఆయుర్వేదం మొక్కలు , భవిష్యత్తులో నీడనిచ్చే మొక్కలను ఆనందోత్సవాలతో నాటారు.తొలుత పలు డివిజన్లో ,నగర పుర వీధులలో పాఠశాల చిన్నారులు వన మహోత్సవ అవగాహన ర్యాలీ ఉల్లాసంగా నిర్వహించారు. చేతిలో పలు రకాల సందేశాలను ఇచ్చే ఫ్ల కార్డులను చేత పూని పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. వన సంరక్షణ మన సంరక్షణ , నేచర్ కన్స్ట్రక్ట్లీ టీచెస్ యూ టు గ్రో, వృక్షో రక్షతి రక్షితః, చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, వనాలు ఉంటేనే జనాలకు భవిష్యత్తు తదితర నినాదాలు ఉన్న ప్ల కార్డులతో ర్యాలీ అందరినీ ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ భూమి మీద బ్రతికే మానవులతోపాటు అన్ని జీవులు ప్రాణ వాయువుతోనే జీవనం కొనసాగిస్తున్నాయని,
ఆ ప్రాణవాయువును మనకు చెట్ల ద్వారానే వస్తున్నదని అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లు అయ్యేంతవరకు సంరక్షించాలని తెలియజేశారు.
పాఠశాల విద్యార్థులు తమ పుట్టినరోజున తప్పనిసరిగా ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు సమాజంలోని ప్రతి ఒక్కరూ వన మహోత్సవాన్ని నిర్వహించి మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest