Mahaa Daily Exclusive

  నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు నిందితుని అరెస్ట్ రిమాండ్ కు తరలించిన పోలీసులు..!

Share

వరంగల్ మహా ;

వరంగల్ మహా నగరంలో నకిలీ ధ్రువపత్రాల దందా గుట్టు రట్టయింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మట్టెవాడ పోలీస్ తో కలిసి రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆన్‌లైన్‌లో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కొంతకాలంగా వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్, వేణురావు కాలనీ ప్రాంతంలో నల్లవెల్లి అమరేందర్ (తండ్రి: రాజేశ్వరరావు, వయస్సు: 35 సం., చిరునామా: నయీం నగర్, హనుమకొండ) అనే వ్యక్తి “హనుమాన్ ఆన్‌లైన్ సెంటర్” పేరుతో ఒక కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇతడు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను మోసం చేస్తూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ మున్సిపాలిటీకి చెందిన, వరంగల్ రెవెన్యూ అధికారులకు సంబంధించిన సంతకాలను ఫోర్జరీ చేసి నివాస (రెసిడెన్షియల్), జనన (బర్త్) ధ్రువపత్రాలను సృష్టిస్తున్నాడు.
ఆధార్ కార్డులలో మార్పులు చేర్పులు అవసరమైన ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, ఏజెంట్లను నియమించుకుని, అధిక డబ్బులు వసూలు చేస్తూ ఈ నకిలీ జనన, నివాస ధ్రువపత్రాలను తయారు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆధార్ సెంటర్ల వారితో కుమ్మక్కై వారి సహకారంతో నకిలీ ధ్రువపత్రాల ఆధారంగా ఆధార్ కార్డులను కూడా తయారు చేస్తున్నట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం అందుకున్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, మట్టెవాడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ముకుమ్మడిగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నల్లవెల్లి అమరేందర్‌ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన ఖాళీ ఫార్మాట్ పేపర్లు, మీ సేవ ఫార్మాట్ పేపర్లు (ముద్రించినవి), ఒక ప్రింటర్, కీబోర్డు, రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

ఇలాంటి నకిలీ ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ధ్రువపత్రాలను సంబంధిత ప్రభుత్వ అధికారుల ద్వారా మాత్రమే పొందాలని, లేనిచో నకిలీ ధ్రువపత్రాలు పొందిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
అమరేందర్‌ పై సెక్షన్లు 318(2)(4), 336(2)(3), 337, 340(1),(2) ఆఫ్ BNS కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపిరెడ్డి తెలిపారు.

Latest