సంగారెడ్డి, మహా: పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణ పార్టీలు తమ బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇండ్లేనని, అతి త్వరలోనే మా బీసీ పార్టీ రాబోతున్నదని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓ గుర్తు ఉన్నట్లే త్వరలోనే బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతున్నదని అప్పుడు మా బీసీ ఓట్లు బీసీలకేనని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేయబోతున్నదని బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకోవాలన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలోని బీసీలందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల చేయి పట్టుకుని తెలంగాణలో బీసీలం అధికారంలోకి రాబోతున్నామని 2028లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42 శాతం బీసీ రిజర్వేషన్లు అనే బెల్లాన్ని మోచేతికి పెట్టి నాకించే ప్రయత్నం చేస్తున్నారని.. బీసీ బిడ్డ తల్లి కడుపున పుట్టిన బిడ్డగా ఇవాళ చెప్తున్నాను మమ్మల్ని ఇన్నాళ్లు మోసం చేసిన అగ్రవర్ణ పార్టీలను గోల్కొండ కోట వరకు దేకియ్యకపోతే తన పేరు తీన్మార్ మల్లన్న కాదని సవాల్ విసిరారు.
కవితకు ఏమీ సంబంధం ఉన్నది..?
బీసీల రిజర్వేషన్లకు జాగృతి అధ్యక్షురాలు కవితకు ఏం సంబంధం అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తామంటే ఎమ్మెల్సీ కవిత రంగులు పూసుకుని సంబరాలు చేసుకుంటోందని ఆమె తీరు దున్నపోతు ఈనితే దుడ్డెను కట్టేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే కవితకు ఏం సంబంధం మీకు బీసీలతో కంచం పొత్తు ఉందా అని ప్రశ్నించారు. బీసీలకు నిజంగానే 42 శాతం రిజర్వేషన్లు వస్తే మా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు పండగ చేసుకోవాలి కానీ మీరు పండగచేసుకోవడం ఏంటో మాకు అర్థం కావడం లేదన్నారు. 70 ఏళ్లకు పైగా మమ్మల్ని దొక్కి చిత్రహింసలకు గురి చేసి ఈ భూమ్మిద మీకు కూడే లేదని వెళ్లగొట్టిన మీ జాతి పండగచేసుకోవడం ఏందో మాకర్థం కాలేదన్నారు. కవిత తీరు చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారని బీసీలకు ఈమెకేమని సంబంధం అనుకుంటున్నారన్నారు.








