ఆదిలాబాద్, మహా
ఎనిమిదో వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోషియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.శశికాంత్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో ఉద్యోగులు, పెన్షనర్లను విడగొట్టి వచ్చే పీఆర్సీ, డీఏల ఆర్థిక ప్రయోజనాలను పెన్షనర్లకు వర్తించవని పేర్కొంటు చట్టం చేసిందని తెలిపారు. దీని కారణంగా పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదో వేతన సవరణ సంఘం నియమించడంతో పాటు నిబంధనలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కాలానికి సంబంధించి 18 నెలల కరువు భత్యం బకాయిలు చెల్లించాలని, సమగ్రమైన వైద్య సదుపాయాలు ఉండేలా చూడాలని తెలిపారు. కోవిడ్ కంటే ముందు సీనియర్ సిటిజన్లకు కల్పించిన రైలు ప్రయాణ రాయితీలను పునరద్ధరించాలని పేర్కొన్నారు. పీఎం వ్యయ వందన యోజన పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెలిపారు. డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్, గౌరవ అధ్యక్షులు నూతుల దయాకర్ రెడ్డి, గంగాధర్, బాపురావు, దేవిదాస్, రాజవర్ధన్, ఉమాకాంత్, షబ్బీర్, కాళ్ల పురుషోత్తం, కె.నారాయణ తదితరులు పాల్గొన్నారు.








