ఖమ్మం సిటీ, మహా.
తెలంగాణలో కార్మికుల న్యాయ హక్కుల కోసం ఈ నెల 31న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు టి.యు.సి.ఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో టి.యు.సి.ఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఏ.వెంకన్న అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్.ఎల్. పద్మ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికుల పరిస్థితి దిగజారిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. వేతనాలు పెంచకుండా, కార్మిక సంఘాలతో చర్చించకుండా పాలన కొనసాగించిందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి చివరకు మోసం చేశారని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల అసహనంగా వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటీ అమలు చేయలేదని, కనీస వేతనాలపై జీవోలను సవరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కార్మిక శాఖ అప్రభావంతో ఉందని, శాఖకు మంత్రి ఉన్నా, అధికారులు మాత్రం నిర్వాకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా హైదరాబాద్ శిగాచి ఫార్మా కంపెనీలో వందలాది మంది కార్మికులు చనిపోతున్నా, ప్రభుత్వం గణాంకాలు వెల్లడించలేదని పేర్కొన్నారు. ఇది కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పే ఉదాహరణగా అభివర్ణించారు. కేంద్రం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, మోదీ ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో జూలై 31న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో కనీస వేతనం రూ.26,000 చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రూ.9,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జూలై 20 నుంచి 28 వరకు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, కార్మికుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లాకు చెందిన టి.యు.సి.ఐ నాయకులు కొయ్యల శ్రీనివాస్, సి.వై. పుల్లయ్య, వెలదండి బాబు, ఆవుల అశోక్, శరత్, ఎస్కే లాల్ మియా, గోస్ పుల్లయ్య, పేరబోయిన వెంకన్న, పుల్లారావు, కంకణాల శ్రీనివాసరావు, ధారావత్ సక్రు, ములకలపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.








