Mahaa Daily Exclusive

  రైతుల సంక్షేమానికి విద్యుత్ శాఖ కృషి. వేగంగా సాగుతున్న వ్యవసాయ సేవల విస్తరణ…!

Share

ఖమ్మం, మహా.

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు ముందడుగులు వేసింది. రైతుల శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చే విధంగా విద్యుత్ శాఖ కార్యాచరణను మరింత బలోపేతం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో ఈ మార్పులకు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనగుర్తి శ్రీనివాస చారి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తాజాగా మాదిరిగానే మీడియాకు ఇచ్చిన ప్రకటనలో వివిధ కార్యక్రమాలను విశదీకరించారు.

* వ్యవసాయ సర్వీసుల మంజూరులో వృద్ధి.

2023-24 కాలానికి సంబంధించి 3,875 వ్యవసాయ సర్వీసులను మంజూరు చేసిన విద్యుత్ శాఖ, 2024-25లో ఆ సంఖ్యను 4,018కి పెంచినట్లు తెలిపారు. అంటే గత సంవత్సరం కంటే 143 సర్వీసులు అధికంగా మంజూరయ్యాయి. ఇది దాదాపు 14 శాతం వృద్ధికి సూచనగా చెప్పవచ్చు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వేగం పెంచామని అన్నారు.

* “పొలంబాట”తో రైతులకు చేరువ.

విద్యుత్ అధికారులు “పొలంబాట” పేరుతో తాము ప్రత్యక్షంగా పల్లెల్లోకి వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని శ్రీనివాస చారి తెలిపారు. ఇప్పటివరకు 1,937 లూజ్ లైన్లు, 1,426 వంగిన పోల్స్, 2,013 మధ్య స్తంభాలు మార్చినట్లు వివరించారు. మోటార్ల మన్నిక పెరగడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గించేందుకు కెపాసిటర్ల అమర్పు చేస్తున్నట్టు తెలిపారు. ఇది రైతుల కోసం అవగాహన కల్పించాల్సిన కీలక అంశమని పేర్కొన్నారు.

* ఎస్టిమేట్ కాపీలు తెలుగులో…

రైతులకు మరింత స్పష్టత కల్పించేందుకు వ్యవసాయ విద్యుత్ ఎస్టిమేట్ కాపీలను తెలుగులో అందిస్తున్నామని, మెటీరియల్స్ వివరాలు, నక్షా వంటి సమాచారం ఎస్ఎంఎస్ లింకుల ద్వారా కూడా తెలుగులో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ విధానంతో రైతులకు ఎటువంటి సందేహాలు లేకుండా పని స్పష్టతగా అర్థమవుతుందని అన్నారు. ఏ రకం సామాగ్రి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అధికారికంగా స్పష్టం చేశారు.

* ట్రాన్స్ఫార్మర్ల తరలింపు, మరమ్మతులు.

ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయిన సందర్భాల్లో వెంటనే స్పందించేందుకు విద్యుత్ శాఖ నాలుగు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. ఎస్పీఎం షెడ్లు ఏర్పాటు చేసి మరమ్మతుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఇలా మరమ్మతు కేంద్రాల విస్తరణతో రైతులకు వేగంగా సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.

* పిడుగుల నివారణ, అదనపు ట్రాన్స్ఫార్మర్లు.

వేసవిలో విద్యుత్ వినియోగం అధికమవుతుందనే అంచనాలతో ఇప్పటికే 360 కొత్త ట్రాన్స్ఫార్మర్లు అమర్చామని, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని 81 మేర పెంచామని చెప్పారు. అలాగే పిడుగుల నివారణ చర్యలుగా లైట్నింగ్ అరిస్టర్లను అమర్చడం జరుగుతోందని తెలిపారు.

* పట్టణం-గ్రామాల్లో సమయానుసార మార్పులు.

పట్టణాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో, గ్రామాల్లో అయితే 48 గంటల్లో వాటిని భద్రపరుస్తున్నట్లు వివరించారు. ఈ పనిలో ప్రొఫెషనల్ నిబద్ధతను పాటిస్తున్నామని స్పష్టం చేశారు.

* రైతుల సంక్షేమమే లక్ష్యం.

రైతులు అనుభవించే విద్యుత్ సమస్యలపై చర్యలు తీసుకుంటూ, నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని శ్రీనివాస చారి తెలిపారు. వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, సేవల విస్తరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాల్లో విద్యుత్ శాఖ వేగంగా స్పందిస్తున్నందున, రైతులు శ్రద్ధగా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

Latest