కూసుమంచి, జులై 15, మహా:
కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి భాస్వరం కరిగించే బ్యాక్టీరియాపై నారు కట్టలు పిఎస్బీ ద్రావణంలో ముంచే పద్దతి గురించి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాస్వరం కరిగించు బ్యాక్టీరియాను వినియోగించడం వలన భూమిలో పేరుకుపోయిన భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందుబాటులో స్థితిలోకి తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పి.ఎస్.బి ద్రావణాన్ని విత్తన శుద్ధి ద్వారా, నారుకట్టలు ముంచే పద్ధతి ద్వారా మరియు ప్రధాన పొలంలో పశువుల ఎరువుతో కలిపి చల్లడం ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని అనుసరించి వినియోగించవచ్చు అని, తద్వారా భూమిలో పేరుకుపోయిన భాస్వరాన్ని కరిగించడమే కాకుండా భాస్వరం ఎరువులపై పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు అని తెలియజేశారు. నారు కట్టలు ముంచే పద్ధతిలో 20 నుండి 25 లీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్లు పిఎస్బి ద్రావణాన్ని కలిపి ఎకరానికి సరిపడే నారు కట్టలను 20 నిమిషాల పాటు ముంచిన తర్వాత నాటు వేసుకోవాలి, ప్రధాన పొలంలో వాడే విధానంలో 100 కేజీల పశువుల ఎరువులో ఒక లీటర్ పి ఎస్.బి ద్రావణాన్ని లేదా ఒక కేజీ పీ.ఎస్.బి పొడిని కలిపి చల్లుకోవాలని సూచించారు. అనంతరం నానో యూరియా యొక్క ఉపయోగాలు మరియు వాడే విధానాన్ని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి వంశీ కృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.








