ఆదిలాబాద్, మహా
ప్రభుత్వం నిరుపేదలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో
ప్రభుత్వం ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చింది. కానీ ఈ పథకానికి ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టిన ఈ పథకం నిధుల లేమి కారణంగా ముందుకు సాగడం లేదు. ఫలితంగా భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం అందని ద్రాక్షలాగానే మారుతోంది. తొలి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేయగా.. రెండో విడత పల్లెలకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా చేపట్టారు. కానీ ఆర్థిక సాయం మాత్రం పంపిణీ చేయడం లేదు. ఫలితంగా ఆరు నెలలుగా లబ్ధిదారులు ఈ పథకం అమలు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఎప్పటిలోగా పంపిణీ చేస్తారో అధికార యంత్రాంగానికి కూడా స్పష్టత లేకపోవడంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
భూమిలేని నిరుపేదలకు వరం..
ప్రభుత్వాలు సాగు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా పేరిట ప్రతి ఏటా ఆర్థిక సాయం అందిస్తున్నాయి. గత ప్రభుత్వం రైతుబంధు పేరిట ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు విడతల్లో రూ.10వేల సాయం అందించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సాయాన్ని రూ.12వేలకు పెంచి ఇస్తోంది. ఇలా రైతులకు పెట్టుబడి రూపంలో సాయం అందిస్తున్నా అసలే భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ఎలాంటి పథకం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం గుంట భూమి లేని నిరుపేదలకు ఆత్మీయ భరోసా పేరిట ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఏటా రూ.12వేల చొప్పున రెండు విడతల్లో ఈ సాయం అందించనుంది. ఇందుకు ఉపాధిహామీ పనిలో వంద రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాలకు ఈ సాయం వర్తింపజేయాలని ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఈ పథకాన్ని ఈ ఏడాది జనవరి 26న అట్టహాసంగా ప్రారంభించారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున అర్హులైన లబ్ధిదారులకు అందించారు. కానీ రెండో విడతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లబ్ధిదారుల్లో ఆతృత…
ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. ఇందులో భాగంగా తొలి విడతలో ఆదిలాబాద్ జిల్లాలో 17 మండలాల్లో 869మంది లబ్ధిదారులకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందజేయగా.. రెండో విడతలోనూ లబ్ధి చేకూర్చే కుటుంబాలను అధికారులు గుర్తించి ప్రభుత్వానికి పంపించారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేక కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్ కార్డులు జారీ చేసినా ఇందులో రెగ్యూలర్ గా పనికి వెళ్లే కుటుంబాలు మాత్రం 1,14,906 ఉండగా వీటి పరిధిలో 2,06,399మంది కూలీలు పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంద రోజులు పని పూర్తయిన కూలీలను ఈ పథకం కింద ఎంపిక చేయగా.. జిల్లాలో 23023 మంది గుంట భూమి లేని వ్యవసాయ కూలీలు ఈ పథకం కింద అర్హులగా అధికారులు తేల్చారు. ఈ పథకం సుమారు ఆరు నెలలు గడిచిపోయినప్పటికీ రెండో విడత ఆర్థిక సాయం మాత్రం ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేసిన ప్రభుత్వం ఆత్మీయ భరోసా నిధులు కూడా విడుదల చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి రాగానే అందజేస్తాం
రవీందర్ రాథోడ్, డీఆర్డీఓ, ఆదిలాబాద్
ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన వారి జాబితాను పంపించాం. ఇప్పటికే తొలి విడత ఎంపిక చేసిన గ్రామాల లబ్ధిదారులకు ఈ సాయం అందించింది. రెండో విడతలో గుర్తించిన వారికి కూడా ప్రభుత్వం త్వరలోనే ఆర్థిక సాయం అందించనుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం.








