భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (మహా):
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఖమ్మం జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేకానంద, దామోదర రాజనర్సింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ (సీతక్క), వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వర్షాకాలం అయినందున జిల్లా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులు, చెరువులలో నీటి నిల్వలు స్థాయి- వినియోగం, వానాకాలం సీజన్ లో వ్యవసాయ సాగు, యూరియా నిల్వలు, ఎరువులు కొరత లేకుండా సమకూర్చడం, ప్రతి ఫర్టిలైజర్ షాపును తనిఖీలు చేపట్టి ఆయా షాపులలో ఉన్న నిల్వలు, నోటీస్ బోర్డులపై ఉంచిన వివరాల పరిశీలన చేసి పక్కదారి పట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జన జీవనానికి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, రహదారులు తెగిపోకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని తెలిపారు. జూన్ నెల నుండి ఇప్పటివరకు వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని, వాతావరణ సూచనలకు అనుగుణంగా జిల్లాలలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జిల్లాలలో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. గిరిజనులు అంటూ వ్యాధుల బారిన పడకుండా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు అందుబాటులో ఉండాలని తెలిపారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలని, పశువులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుత నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు కలెక్టర్ల కార్యచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదికను అందించాలని తెలిపారు. వర్షాలను దృష్టిలో ఉంచుకొని సాగునీటికి సంబంధించి నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతి ఎరువుల షాపు వద్ద స్టాక్ వివరాలు తెలిసేలా బోర్డుపై ప్రదర్శించాలని, ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ఎరువుల కొరత ఉన్నట్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, ఈ విషయంపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు. యూరియా కావలసినంత అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, రైతు సంక్షేమమే అన్నిటికన్నా ముఖ్యమని తెలిపారు. ఎరువులకు సంబంధించి ఫిర్యాదుల కొరకు ప్రతి జిల్లాలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96 లక్షల 95 వేల 299 రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల ద్వారా దాదాపు 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గతంలో చౌక ధరల దుకాణాలపై ప్రజలకు ఆసక్తి ఉండేది కాదని, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ కార్డు, చౌక ధరల దుకాణం విలువ పెరిగిందని, 3 నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలలో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, శాసన సభ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని, జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది ఖాళీలను పరిశీలించి అవసరమైన మేరకు నియామకంతో పాటు మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాలలో అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని, డెంగ్యూ, మలేరియా ఇతర జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాతావరణ శాఖ సూచన మేరకు వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజా సంక్షేమం కోసం 3 గంటల ముందుగా బృందాలను పంపించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సంక్షేమ చర్యలకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులతో మాట్లాడుతూ…
జిల్లాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముప్పు ఉండే ప్రాంతాల్లో ముందస్తుగా అవసరమైనంత మేరకు ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వర్షాలు పెరగడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా మెలకాల కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. నీటి నిల్వలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వి దోమల వ్యాప్తి నివారించాలని సూచించారు.
యూరియా వంటి కీలక ఎరువుల సరఫరా విషయంలో రైతులలో ఆందోళన కలగకుండా ఉండేందుకు ప్రతి ఎరువుల దుకాణం ముందు అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను ప్రదర్శించేలా స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైతే డిమాండ్‌కు అనుగుణంగా మరింత స్టాక్ కూడా సమకూర్చేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచిచారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ సంజీవరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా వైద్య శాఖ అధికారి జయలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ అర్జున్ రావు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








