ఆదిలాబాద్ మహా : కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి (TVVP) లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. గురువారం సంఘ నాయకులు, సిబ్బందితో కలిసి ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. నాలుగు నెలల వేతనాలు వెంటనే చెల్లించి, పీఎఫ్ పూర్తి వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ & ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పటల్ ముందు కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. వేతనాలు, ESI, PF కట్టకుండా అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చూపుతున్నారని, అధికారులూ ఇప్పటికీ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు తక్కువ వేతనాల్లో సేవలందిస్తూ కుటుంబాలపై భారం మోస్తున్నారు. అయినా కూడా వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం, కాంట్రాక్టర్లు కాలయాపన చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది రాము, ఇమ్రాన్, సాయి, తిరుమల, పుష్ప, మీనాక్షి, రాజేష్, నరేష్, భాగ్య, శారదా, నిర్మల, మునేశ్వరి తదితరులు పాల్గొన్నారు.








