మహా భద్రాచలం
గిరిజన సర్వతోముఖాభివృద్ధికి ఐ టీ డి ఏ కృషి చేస్తుందని భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. శుక్రవారం ఐ టీ డి ఏ కార్యాలయంలో జరిగిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. గిరిజన అభివృద్ధి కొరకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక వసతుల కల్పనకు ఐ టీ డి ఏ పెద్ద పీట వేస్తుందని అన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షిస్తూ, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఐ టీ డి ఏ ద్వారా 349 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నడపబడుతున్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 32 గురుకుల పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. 10 వ తరగతిలో 98.34 శాతం విద్యార్థులు ఉత్తీర్నలు అయ్యారని అన్నారు. గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని, అలాగే గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు కొత్తగా 87 బి టీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. 109 పంచాయతీలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మాణం చేపట్టామని అన్నారు. కోయ, కొండ రెడ్డి, లంబాడ, నాయక్ పోడు తదితర గిరిజన సంస్కృతి ప్రతిభించేలా.. వారి అలవాట్లు, వ్యవసాయం, వాడే వస్తువులతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం గిరిజన విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.








