కొత్తగూడెం, మహా.
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులను గుర్తించి సత్కరించారు. టీఎస్ ఎన్పీడీసీఎల్ ఎల్టీ మీటర్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకుల మౌనికా, తన కృషి, క్రమశిక్షణ, ప్రజాసేవాభావం ద్వారా జిల్లా విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రశంసాపత్రం అందుకున్నారు.
ఈ ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు, విద్యుత్ సదుపాయాలను నిరంతరాయంగా అందించేందుకు ఆకుల మౌనికా చూపించిన అంకితభావం ప్రశంసనీయమైంది” అని అన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఆకుల మౌనికా పనితీరును మెచ్చుకొని, మరిన్ని మహిళా ఇంజనీర్లు ఈ విధంగా ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. వేడుకలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








