కారేపల్లి, మహా : సీతారామ ప్రాజెక్టుపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు విమర్శించారు. ఆదివారం కారేపల్లి మండలం పాటిమీదిగుంపులో రైతు సదస్సు జరిగింది. ఈసదస్సులో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగుకు నీరు అందించే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడం లో 20 ఏండ్ల నుండి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. 2000 సంవత్సరం నుంచి వరసగా మూడు సీజన్లలో వచ్చిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగర్ ఆయకట్టు బీడు గా మారిందన్నారు. దీనికి గోదావరి జలాలు తరలింపు మాత్రమే పరిష్కారమని 2003 లో ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గోదావరి జలాలు సాధన మహా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రం లో 2004 లో అధికారం లోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2005 డిసెంబర్ 31 దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన నేటికీ పూర్తి చేయుడంలేదన్నారు. 2016 సంవత్సరంలో కేసిఆర్ ప్రభుత్వం రిడిజైన్ పేరు తో మార్పు చేసి సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ జూలూరుపాడు మండలం చివరి వరకు పూర్తి చేసిందని తెలిపారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయింపులు లేకపోవడం తో పనులు కొనసాగడం లేదన్నారు. గోదావరి జలాలు పాలేరు కు అనుసంధానం చేయడం తోపాటు కామేపల్లి, కారేపల్లి మండలాల పరిధిలో సాగు భూములు కు నీరు అందించాలన్నారు. సీతారామ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయాలని లేకుంటే రైతు ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నానో యూరియా ప్రోత్సహించాలని పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూరియా సరఫరాలో కోత విధించిందన్నారు. మిర్చి ఇతర పంటల సాగు తగ్గి పత్తి సాగు పెరగడంతో యూరియా వాడకం పెరిగిందన్నారు. యూరియా కొరతను దృష్టిలో ఉంచుకోని రామగుండం ప్యాక్టరీలో యూరియా ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదన అర్దం చేసుకోకుండా మంత్రులు యూరియా సమస్యలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సహేతుకం కాదన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం ఐక్య రైతు ఉద్యమమే మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కే నరేంద్ర, రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు, నాయకులు సీతారామయ్య,మాజీ సర్పంచ్ రాంబాయిమ్మ, ధనమ్మ, వెంకన్న, శ్రీనివాసరావు, రవి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.







