- స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్
- బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు
- స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ధర్మాసనం
- విచారణ నేటికి వాయిదా.. ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందని చర్చ
- జీవో ఆధారంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్
- అడ్డంకులు లేకుంటే నేడే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంటున్న న్యాయ నిపుణులు
హైదరాబాద్, మహా: స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.9కు గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం ఉన్నది. జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే, ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగా గోపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని..అవి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా 50 శాతానికి మించి ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు దృష్టి తీసుకొచ్చారు. ఆ పిటిషన్‌పై ఇప్పటికే ప్రాధమిక విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా హైకోర్టులో మొత్తం 7 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, మెట్టు సాయి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయగా లేటెస్ట్‌గా కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్, ఇందిరా శోభన్, చరణ్ యాదవ్ కూడా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు.
ఎన్నికలు సజావుగా జరగొచ్చనే చర్చ..
గత విచారణ సందర్భంగా కూడా షెడ్యూల్ విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని కోరగా హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ మరుసటి రోజే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 6న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా పిటిషనర్లు స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఇందుకు నో చెప్పింది. బీసీ రిజర్వేషన్ల పెంపు వివాదం న్యాయస్థానానికి చేరడంతో స్థానిక ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠ గత కొన్ని రోజులుగా నెలకొంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చెల్లదని.. దాన్ని కోర్టులు కొట్టి వేస్తాయన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే.. జీవోను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు స్థానిక ఎన్నికలను ఆపేందుకు మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదు. దీంతో ఎన్నికలు సజావుగా జరగొచ్చనే చర్చ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వానికి హైకోర్టు తాజా ఆదేశాలు ఊరటనిచ్చాయి.
నేడు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు లేనందున నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరినా కూడా హైకోర్టు నిరాకరించింది. హైకోర్టులో బుధవారం నాడు జరిగిన విచారణకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. హైకోర్టు ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు చెప్పనందున నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29న షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇక తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ మీద స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు..
రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదు. విద్య, ఉద్యోగాల్లో 50శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదు.
-42శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదు. బీసీ కుల గణన చేశారు. కానీ బహిర్గతం చేయలేదు. బీసీ కులగణన ఆధారంగా 42శాతం రిజర్వేషన్లు అంటున్నారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా ఆధారం అని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా? తగ్గిందా? ఆ లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు.
-ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా చేస్తారు? రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేం వ్యతిరేకం కాదు. రాజ్యాంగ విరుద్ధంగా ఎలా నిర్వహిస్తారు?
-ట్రిపుల్ టెస్ట్‌ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవు. 50 శాతం రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధం.
ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు..
-చట్టాన్ని ఎవరూ ఛాలెంజ్ చేయలేదు. చట్టం ఆధారంగా చేసిన జీవోలను ఛాలెంజ్ చేశారు. జీవోకు మూలమైన చట్టాన్ని సవాల్ చేయకుండా జీవోను మాత్రమే ఛాలెంజ్ చేయడం కుదరదు.
-దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను సమర్థించాయి.
-రిజర్వేషన్ల గరిష్ట పరిమితి దాటకూడదని సుప్రీం కోర్టు ఆదేశామే తప్పితే.. రాజ్యాంగంలో ఎక్కడా నిబంధన లేదు. డేటా ఆధారంగా ప్రభుత్వానికి, శాసన వ్యవస్థకు తగిన నిర్ణయం తీసుకునే అధికారం ఉంది.
-శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. సవరణ చేసినా, చట్టం చేసినా శాసనవ్యవస్థదే నిర్ణయం ఉంటుంది. చట్టసభలు చేసిన చట్టాలపై కొంతమంది గవర్నర్లు ఏ నిర్ణయమూ చెప్పడం లేదు. బిల్లును ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు.
-ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయి. ఈ సమయంలో స్టే ఇవ్వడం సరికాదు. సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే బీసీ బిల్లు చేశారు, జీవో తెచ్చారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలి.







