- బిజెపి, మృతుని కుటుంబ సభ్యులు ధర్నా
- వేమనపల్లి మండలంలో కాంగ్రెస్ నేతల ఇబ్బందులు
బెల్లంపల్లి/మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లా, వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుల ప్రోత్భలంతో మధుకర్ పై పోలీసులు అక్రమంగా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో మానసికంగా ఒత్తిడికి లోనై
అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ నేతలు రుద్రపట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమలలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రోడ్డుపై భాజపా నాయకులు ధర్నా, ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘటన పై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
మరణ వాంగ్మూలం
మృతుడు ఏట మధుకర్ తన ఆత్మహత్యకు రుద్రపట్ల సంతోష్, గాలి మధు, చింతకింతి కమల,లు అని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఘటన స్థలిలో లభించిన లేఖలో ఇలా ఉంది. నా చావుకు కారణం రుద్రపట్ల సంతోష్,, గాలి మదు, చింతకింది కమలల మూలాన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీరు నాపై రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసు పెట్టించి నా యొక్క పరువు ప్రతిష్టలను దెబ్బ తీశారు. నా చావుకు కారణమయ్యారు. నేను తప్పు చేయలేదు. అలాంటి క్యారెక్టర్ నాది కాదు. అందుకని వీళ్ళ పైన చట్టారీత్యా చర్యలు తీసుకోవాలీ. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలి. నా కుటుంబాన్ని కాపాడాలి. వేమనపల్లి మండలం ప్రజలారా.. మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు దుర్గం శివరాం, ఇప్పుడు ఏట మధుకర్ ఇప్పుడు బలి కావాల్సిందేనా.. అందుకే ఆలోచించండి. ఈ అగ్రవర్ణ కులాలకు బుద్ధి చెప్పండి. భారత్ మాతాకీ జై అంటూ మృతుడు మధుకర్ మరణ వాంగ్మూల ధ్రువపత్రం రాశాడు. ఈ పత్రాన్ని గ్రామీణులు, ప్రజల సమక్షంలో భాజపా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ అందరికీ చదివి వినిపించారు.
కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తాం.
మా బిజెపి నేత ఏట మధుకర్ మృతి ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి, రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు లకు లేఖ రాస్తామని మంచిర్యాల బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేష్ గౌడ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత వేమనపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నేతల వేధింపులు సామాన్య ప్రజలపై ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కొయ్యల ఏమాజీ, చెన్నూరు నియోజకవర్గం ఇన్చార్జి దుర్గం అశోక్, కోటపల్లి, బెల్లంపల్లి, మంచిర్యాల తదితర మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
పోలీసుల భారీ బందోబస్తు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఏట మధుకర్ మృతి ఘటన నేపథ్యంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. అంతకుముందే మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించడంతో ముందస్తు చర్యలో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాలలో పోలీసు బలగాలను మోహరించారు.








